అంతా అక్రమమే.. (నెల్లూరు)
నెల్లూరు, ఫిబ్రవరి 05 : కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న ఇసుక అక్రమ రవాణా వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. రాజకీయ పరపతి కలిగిన కొందరు నేతలు నాయుడుపేట డివిజన్‌లోని స్వర్ణముఖి, మామిడి కాలువల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు నిర్వహించి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. మరోవైపు పక్కా గృహాలు నిర్మించుకునే సామాన్యులు ఇసుక కొరతను ఎదుర్కొంటున్నారు. నూతన ఇసుక పాలసీ విధానం అమల్లోకి వచ్చిన తరువాత కొన్ని నెలల పాటు స్వర్ణముఖి, మామిడి కాలువల్లో తవ్వకాలపై ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. స్థానిక అవసరాలకు పెళ్లకూరు మండలం పుల్లూరు వద్ద స్వర్ణముఖి నదిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారీ నుంచి ఇసుకను తీసు‘కొనే’ ఏర్పాటు చేసింది. ఈ క్వారీని రాజకీయ సిఫార్సుల మేరకు గనులు శాఖ అధికారులు చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దీంతో డివిజన్ పరిధిలోని గ్రామాలకు ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకునేందుకు వెబ్‌సెట్ చూస్తే ఇసుక నిల్వలేదని చూపిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన క్వారీలో ఇసుక స్థానిక అవసరాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిపోతుందన్న విమర్శలు ఉన్నాయి. నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ మండలాల్లో పక్కాఇళ్లు, ఇతర నిర్మాణదారులు నెల్లూరు సమీపంలో ఉన్న పెన్నానది క్వారీల నుంచి ఇసుక తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా ట్రాక్టర్ ఇసుక తీసుకురావాలంటే రూ.7 వేల వరకు ఖర్చు చేయాల్సి రావడంతో భవన నిర్మాణదారులు అదనపు భారం భరించాల్సి వస్తోంది. నూతన ఇసుక పాలసీ అమల్లోకి వచ్చినా స్థానికలకు ఇసుక అందుబాటులేక భవన నిర్మాణ కార్మికులకు మరోవైపు ఉపాధి లేకుండాపోయింది.
అక్రమ వ్యాపారం ఇలా..
నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన క్వారీల నుంచే ఇసుక సరఫరా చేయాలి. ఇలా కాకుండా స్థానికంగా రాజకీయ పరపతి కలిగిన కొందరు నేతలు తమ తమ ప్రాంతాల్లో అనధికారికంగా క్వారీలు ఏర్పాటు చేసుకొని ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలుగా సరఫరా చేస్తున్నారు. నాయుడుపేట మండలంలో భీమవరం వద్ద స్వర్ణముఖి పొర్లుకట్టకు గండి కొట్టి పక్కాగా దారి ఏర్పాటు చేసి రాత్రి పూట దగ్గరలో ఉన్న కంపెనీలకు ఇసుకను తరలిస్తున్నారు. కొందరు ఎడ్లబండ్ల ద్వారా ఒక చోటకు చేర్చి అక్కడి నుంచి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
-------------