పన్ను కట్టని పట్టణం (కడప)
కడప, ఫిబ్రవరి 05 : నిధుల లేమితో స్థానిక సంస్థలు అభివృద్ధికి దూరమవుతున్నాయి. నగర, పురపాలక సంఘాలకు ఆస్తి, నీటి పన్నులే వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. వీటి వసూలులో ఆయా సంస్థలు చూపుతున్న అశ్రద్ధ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. జిల్లాలోని ఒక నగర, ఎనిమిది పురపాలక సంఘాలు పన్ను వసూలు లక్ష్య సాధనలో వెనుకబడ్డాయి. కడప నగర, పురపాలికల్లో ఆస్తి, నీటి పన్ను వసూలులో సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. గడువు సమీపిస్తున్నా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. గతంలో సిబ్బంది కొరత వేధిస్తోందని చెప్పేవారు. సచివాలయ వ్యవస్థ కింద ఉద్యోగులు, వాలంటీర్లు నియమితులవటంతో ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పవచ్ఛు ఉన్నతాధికారుల పర్యవేక్షణ, నిర్లక్ష్యం ఫలితంగా పన్ను వసూలులో వెనుకపడినట్లు కనిపిస్తోంది. జిల్లాలో కడప కార్పొరేషన్ తో పాటు 8 మున్సిపాలిటీలున్నాయి. ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, బద్వేలు, రాజంపేట, రాయచోటి, మైదుకూరు ఉన్నాయి. అస్సెస్‌మెంట్లు 2,32,011గా నిర్ధరించారు. వీటి నుంచి ఆస్తి పన్ను రూ.6741.75 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు సగంలోపే వసూలు చేయగలిగారు. ఇక నీటి కుళాయి కనెక్షన్లు సుమారు లక్ష వరకు ఉన్నాయి. రూ.2,850.44 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. ఆస్తి, నీటి పన్నులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-2020)కి లక్ష్యం దాదాపు రూ.10,000.00 లక్షలుపైగా ఉంది. సగంలోపే వసూలైందని అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. తక్కిన మొత్తాన్ని మార్చి 31వ తేదీ నాటికి వసూలు చేయాల్సి ఉంది. మార్చి మొదటి వారానికి 95 శాతం వసూలు చేయాలని ఉన్నతాధికారులు నిర్దేశించారు. నీటి పన్ను 40 శాతం, ఆస్తి పన్ను 55 శాతం వసూలు చేయగలిగారు. గతంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పన్ను వసూలు చేశారు. ఆ దిశగా కమిషనర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంది. పురపాలికలో మేనేజరు, ఆర్వోలు, డీఈఈలు, ఆర్‌ఐలు, బిల్లు కలెక్టర్లు ఉన్నారు. వీరందరిపై కమిషనర్లు పర్యవేక్షణ ఉంటుంది. సిబ్బంది రోజువారీ పన్ను వసూళ్లను ఉన్నతాధికారులకు నివేదించాల్సి ఉంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం అమలు కావటంలేదు. దీంతో ప్రక్రియ గాడితప్పినట్లు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పన్ను బకాయిలు కోట్లలో ఉంది. బకాయిలు ఎప్పుడు వసూలవుతాయో తెలియని పరిస్థితి. అధికారులు సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప పన్ను వసూలు లక్ష్యానికి చేరుకోలేరు. వసూలులో వెనుకపడితే పురపాలికల్లో అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ప్రొద్దుటూరులో నీటి కుళాయి కనెక్షన్లు సుమారు 20 వేలకు పైగా ఉన్నాయి. 2019-2020కి నీటి పన్ను రూ.470.95 లక్షలు వసూలు కావాల్సి ఉంది. రూ.140.80 లక్షలు మాత్రమే వసూలైంది. తక్కిన మొత్తం వసూలు చేయాల్సింది. ఆస్తి పన్ను విషయానికొస్తే 30,811 అస్సెస్‌మెంట్లకు రూ.1,856 లక్షలు లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందులో రూ.772.32 లక్షలు మాత్రమే వసూలైంది. లక్ష్యంలో 41 శాతం మాత్రమే వసూలు చేయగలిగారు. జిల్లాలో అన్ని పురపాలక సంస్థల్లో ఇదే మాదిరిగా ఉంది. స్థానిక ఎన్నికలకు సిద్ధమైతే పన్నుల వసూలుపై బకాయిదారులపై ఒత్తిడి పెంచరాదని ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది.