YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

 అంతా ధూళిమయం (హైదరాబాద్)

 అంతా ధూళిమయం (హైదరాబాద్)

 అంతా ధూళిమయం (హైదరాబాద్)
హైదరాబాద్, ఫిబ్రవరి 05 : దుమ్ము ధూళి కణాలు భాగ్యనగరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రమాదకర మార్కును దాటేసి ఆందోళన కలిగిస్తున్నాయి. నిర్దేశిత పరిమితుల కంటే అధికంగా నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. గతేడాది ఒకచోట మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ అధికంగా నమోదైనట్లుగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) తాజాగా తేల్చింది. తొమ్మిది ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం ఘనపు మీటరు గాలిలో వార్షిక సగటు 60 ఎంజీలు దాటకూడదు. ఆ మార్కు దాటితే ప్రమాదకర జోన్‌లో ఉన్నట్లుగానే లెక్క. 20 ఎంజీలు దాటితే అప్రమత్తం కావాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరిస్తోంది. సుమారు 20 ప్రాంతాల్లో లెక్కలు తీస్తే ఒక్క కేబీఆర్‌ఎన్‌ పార్కు వద్ద మాత్రమే పీఎం 10 నిర్దేశిత పరిమితిని దాటలేదు. బాలానగర్‌, జీడిమెట్ల, ఉప్పల్‌, జూబ్లీహిల్స్‌, ప్యారడైజ్‌, కూకట్‌పల్లి, చార్మినార్‌, జూపార్క్‌, లంగర్‌హౌజ్‌ లాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో వంద ఎంజీలు దాటింది. బాలానగర్‌లో అత్యధికంగా 148 ఎంజీలు, జీడిమెట్లలో 133 ఎంజీలు నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. శివారు ప్రాంతమైన శామీర్‌పేట్‌లోనూ ప్రమాదకర మార్కు కంటే 6.5 ఎంజీలు అధికంగా నమోదు కావడం గమనార్హం. పీఎం 10 తీవ్రత రోజురోజుకీ పెరుగుతుండటంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడం, గడువు తీరిన వాహనాలు రోడ్డెక్కడం, అధ్వాన రోడ్లు, బహిరంగంగా చెత్త కాల్చడం తదితర కారణాలతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు వారు చెబుతున్నారు. మన తల వెంట్రుక మందం 50 మైక్రోగ్రాములు. వెంట్రుక మందంలో అయిదో వంతుండే పీఎం 10 ఊపిరి పీల్చుకోకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. లేనీపోని అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. పీసీబీ అధికారులు బాలానగర్‌, ఉప్పల్‌, జూబ్లీహిల్స్‌, ప్యారడైజ్‌, చార్మినార్‌, జీడిమెట్ల, ట్యాంక్‌బండ్‌, ఎంజీబీఎస్‌, చిక్కడపల్లి, లంగర్‌హౌజ్‌, మాదాపూర్‌, శామీర్‌పేట్‌, కూకట్‌పల్లి, సైనిక్‌పురి, రాజేంద్రనగర్‌, నాచారం, ఆబిడ్స్‌, కేబీఆర్‌ఎన్‌ పార్కు, హెచ్‌సీయూ, జూపార్కు తదితర ప్రాంతాల్లో పీఎం 10 తీవ్రతను క్రమం తప్పకుండా నమోదు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నమోదైన గణాంకాల ఆధారంగా గతేడాది పరిస్థితి ఎలా ఉందో లెక్కలు తీశారు.

Related Posts