కరోనా మృతులు 25 వేలపైనే
బీజింగ్, ఫిబ్రవరి 6
రోనా వైరస్ మృతులపై చైనా ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుందని ఆ దేశానికి చెందిన బహుళజాతి సంస్థ ప్రకటనపై కలకలం రేగుతోంది. వాస్తవానికి కరోనా వైరస్ కారణంగా 24,589 మంది మృతిచెందారని టెన్సెంట్ అనే సంస్థ తెలిపింది. అంతేకాదు, ఈ వైరస్ బాధితుల సంఖ్య కూడా లక్షల్లో ఉన్నట్టు పేర్కొంది. మొత్తం 154,023 మంది వైరస్ బారినపడ్డారని, ప్రభుత్వం మాత్రం తక్కువచేసి చెబుతోందని ఆ సంస్థ వెల్లడించింది. టెన్సెంట్ డేటాపై తైవాన్‌కు చెందిన ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. టెన్సెంట్ ప్రకారం... కరోనా మరణాలు, బాధితులు అధికారిక గణాంకాల కంటే అధికంగా ఉందని ఆ పత్రిక వివరించింది.ఫిబ్రవరి 1 నాటికి కరోనా వైరస్ బాధితుల సంఖ్య అధికారిక గణాంకాల కంటే 10 రెట్లు అధికంగా ఉందని టెన్సెంట్ పేర్కొంది. అలాగే అనుమానిత కేసులు కూడా ప్రభుత్వం పేర్కొన్నట్లు 79,808 కాదని, ఇది నాలుగు రెట్లు అధికమని తెలిపింది. ‘ఫిబ్రవరి 1 నాటికి వైరస్ నుంచి కోలుకున్నది కేవలం 269 మాత్రమేనని, కానీ ఈ సంఖ్య 300గా అధికారులు వెల్లడించారు.. అప్పటికే 24,589 మంది ప్రాణాలు కోల్పోతే, కేవలం 300 మందే చనిపోయినట్టు ప్రకటించారని’ ఆ సంస్థ స్పష్టం చేసింది.ఈ గణాంకాలపై కలకలం రేగడంతో టెన్సెంట్ సంస్థ వాటిని సవరించినట్టు తెలుస్తోంది. ఆ సంస్థ కరోనా మృతుల సంఖ్యపై కనీసం మూడు రెట్లు ఎక్కువ చూపినట్టు నెటిజన్లు గమనించారు.. అయితే, తర్వాత ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలకు అనుగుణంగా సవరించినట్టు నివేదిక తెలిపింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక కారణాలతోనే ఇలాంటి గందరగోళం చోటుచేసుకుని ఉంటుందని కొందరు భావిస్తే.. ఈ సమాచారం నిజమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.కాగా, ఈ నివేదికపై టెన్సెంట్ అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, వివిధ వర్గాల సమాచారం ప్రకారం.. వుహాన్‌లో చాలా మంది కరోనా బాధితులకు వైద్యం లభించక హాస్పిటల్ బయటే ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధితుల సంఖ్య వెల్లడించడానికి ముందే అధికారులు వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు పలు నివేదికలు హల్‌చల్ చేస్తున్నాయి.కరోనా వైరస్ మరణంపై చైనా వెల్లడిస్తున్న గణాంకాలు గందరగోళానికి గురిచేస్తున్నాయని ది వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. టెన్సెంట్ నివేదిక వాస్తమైందే అయితే కరోనా మరణాల 16 శాతంగా ఉంటుంది, 2002 నాటి సార్స్ వైరస్ మరణాలు 9.6 శాతం కంటే ఇది చాలా అధికమని సీసీఎస్ వ్యాఖ్యానించింది. సియాజింగ్ అనే చైనా మ్యాగిజైన్ సైతం ప్రభుత్వ నివేదికలపై విమర్శలు గుప్పించింది. కరోనా వ్యాప్తిని కమ్యూనిస్ట్ ప్రభుత్వం తక్కువచేసి చూపుతోందని దుయ్యబట్టింది. కాగా, గురువారం నాటికి కరోనా వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 563 చేరుకుందని, మరో 28,018 కేసులు నమోదయినట్టు అధికారులు వెల్లడించారు.