YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కమలం వైపే... జేడీ చూపు

కమలం వైపే... జేడీ చూపు

కమలం వైపే... జేడీ చూపు
విశాఖపట్టణం, ఫిబ్రవరి 7,
జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లో ఏదో చేద్దామని వచ్చి ఇప్పటికీ ఏమీ తేల్చుకోలేకపోతున్న మాజీ పోలీస్ అధికారి. ఆయన్ని పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా జనం గుర్తించలేదనడానికి విశాఖ ఎంపీగా ఆయన పోటీ చేస్తే ఓడించడమే ఉదాహరణగా చెప్పుకోవాలి. బ్యూరోక్రాట్లు రాజకీయంగా రాణించింది పెద్దగా లేదు. దానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే మినహాయింపు. అంతకు ముందే రాజకీయాల్లోకి వచ్చిన జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా పార్టీ ఎలా దెబ్బతిందో అంతా చూశారు. ఇక కిరణ్ బేడీ లాంటి వారు కూడా ప్రజా జీవితంలో విఫలమయ్యాకే రాజ్ భవన్ కి పరిమితమయ్యారు. ఇదే వరసలో ఉత్సాహపడిన జేడీకి కూడా అనుభవం పెద్ద పాఠమే నేర్పింది.ఇక జేడీ లక్ష్మీనారాయణను ఎన్జీవోకు ఎక్కువ, పాలిటిక్స్ కి తక్కువా అని ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తారు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యార్ధులకు నీతిబోధలు, తరగతులు నిర్వహించడం వంటివి బాగానే చేస్తారు. అయితే రాజకీయం వేరు. అది పూర్తిగా మాస్ పల్స్ తెలుసుకుని ముందుకు సాగే క్రీడ. జనం భాష మాట్లాడినపుడే వారు నాయకులు అవుతారు. సగటు జనానికి జీడీపీ, అభివృధ్ధి రేటు, ద్రవ్యోల్బణం వంటివి తెలియవు. జేడీ లాంటి మేధావులు ఈ పదాలు పలికితే వారు అందుకే కనెక్ట్ కాలేకపోతున్నారు. జనానికి తమ హక్కులు తెలుసో తెలియదో కానీ వారు తాము ఉన్నచోట‌ ఉండేందుకే ఎక్కువ ఇష్టపడతారు. మార్పు కోసం వారు ఎపుడూ ముందుకు రారు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారి ఆలోచనలకు ఇక్కడే తేడా కనిపిస్తోంది.ఇక జేడీ లక్ష్మీనారాయణ జనసేనను వీడిపోతూ రాజీనామా లేఖ ఇచ్చి వచ్చారు. తాజాగా ఆయన దీనిమీద మాట్లాడుతూ జనసేనతో తన పయనం ముగిసిన అధ్యాయం అన్నారు. తాను పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని ఆయన అంటున్నారు. అంటే జనసేనలో తన లక్ష్యాలు నెరవేరలేదని ఆయన చెప్పినట్లైంది. గ్రామీణ ప్రాంతాలు పర్యటించి జనాలలో చైతన్యం తీసుకువస్తానని కూడా చెబుతున్నారు. అంటే ఓ విధగా గతంలో ఆయన చేసిన అధ్యయన యాత్రలే మళ్ళీ చేస్తారన్నమాట.ఇక్కడే జేడీ లక్ష్మీనారాయణ మనోగతం బయటపడుతోంది. ఆయన అచ్చం బీజేపీ భాషను వల్లించారు. ఇతర దేశాల నుంచి విచ్చల విడిగా జనం వచ్చీ పోవడానికి భారత దేశం ధర్మ సత్రం కాదని జేడీ అంటున్నారు. ఈ దేశంలో పౌరులుగా ఉండాలంటే కచ్చితమైన పత్రాలు ఉండాల్సిందేనని కూడా చెబుతున్నారు. ప్రతి పదేళ్ళకు ఒకసారి నిర్వహించే జన గణనకు అవసరమైన అన్ని పత్రాలు చూపించడం పౌరుల విధి, ఇది తప్పు కానేకాదని వాదిస్తున్నారు. మొత్తానికి సీఏఏ విషయంలో బీజేపీకి మద్దతుగా మాట్లాడేందుకు మరో మేధావి జేడీ రూపంలో లభించాడనుకోవాలి. పనిలో పనిగా బీజేపీ బడ్జెట్ ని కూడా జేడీ లక్ష్మీనారాయణ మెచ్చుకున్నారు. అంటే ఆయన అడుగులు బీజేపీ వైపుగా సాగుతున్నాయని అర్ధం చేసుకోవాలేమో. ఓ విధంగా విద్యావంతుడు, సమర్ధవంతమైన అధికారి అయిన జేడీ బీజేపీలో చేరితే ఆయనకూ, పార్టీకీ కూడా లాభమేనన్న మాట గట్టిగా వినిపిస్తోంది.

Related Posts