కియా లోగుట్టుపై స్టోరీలు
అనంతపురం, ఫిబ్రవరి 7,
అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్… సీఐగా పని చేసినప్పటి తన అలవాట్లను మార్చుకోలేకపోతున్నారు. ఆ అలవాటు… ప్రతి ఒక్కరిని బెదిరించడం. ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉంటే.. ఎవరూ ఏమీ చేయలేరన్నట్లుగా ఒకప్పుడు విర్రవీగిపోయి… కేసుల పాలయిన చరిత్ర ఉన్న ఈ గోరంట్ల మాధవ్ కియా విషయంలోనూ హాట్ టాపిక్ అయ్యారు. కియా తరలి పోతోందన్న ప్రచారం ప్రారంభమైన సమయంలో గతంలో కియా యాజమాన్యాన్ని ఆయన బెదిరించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అచ్చంగా అలానే టీడీపీ ఎంపీల్ని బెదిరించేందుకు.. సాక్షాత్తూ లోక్‌సభలోనే ప్రయత్నించారు గోరంట్ల మాధవ్. లోక్‌సభలో కియా తరలింపు గురించి అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తల్ని ప్రస్తావిస్తున్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వద్దకు… గోరంట్ల మాధవ్ దూసుకు వచ్చారు. రామ్మోహన్ నాయుడు సమీపానికి వచ్చి ఏదో చెప్పాలనుకున్నారు. కానీ ఇంగ్లిష్, హిందీల్లో గోరంట్ల మాధవ్‌కు పెద్దగా పట్టు లేకపోవడంతో.. నోరు తెరిచారు కానీ ఏమీ చెప్పలేకపోయారు. ఈ లోపు చుట్టుపక్కల ఎంపీలు పెద్ద పెట్టున నవ్వి ఇదేం పద్దతని ప్రశ్నించడం.. టీడీపీ ఎంపీలు కూడా.. స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన రామ్మోహన్ నాయుడు దగ్గర్నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. మళ్లీ మధ్యలో ఆగి.. ఏమీ చేయకుండా వెళ్లిపోతున్నానని ఫీలయ్యారేమో కానీ.. మళ్లీ రామ్మోహన్ నాయుడు దగ్గరకు వెళ్లబోయారు. ఇతర ఎంపీలు గట్టిగా కేకలేయడంతో వెళ్లి తన సీట్లో కూర్చున్నారు. గోరంట్ల మాధవ్ వ్యవహారశైలి ఇతర సభ్యులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే కియా ఎక్కడికి తరలి పోవడం లేదు.. టీడీపీ సభ్యులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మిధున్ రెడ్డి లాంటి ఇతర ఎంపీలు తమకు ప్రసంగించే సమయం వచ్చినప్పుడు చెప్పారు. అలా చెప్పలేకపోయిన గోరంట్ల మాధవ్.. టీడీపీ సభ్యుల్ని బెదిరించడానికి మాత్రం ఆవేశంగా దగ్గరకు వెళ్లారు.