YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నో స్మార్ట్ (కాకినాడ,)

నో స్మార్ట్ (కాకినాడ,)

నో స్మార్ట్ (తూర్పుగోదావరి)
కాకినాడ, ఫిబ్రవరి 06 : ఆధునిక సాంకేతికతను జోడించి కొత్త ఆవిష్కరణలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న స్మార్ట్ సిటీల అభివృద్ధి ప్రణాళిక కాకినాడలో ఏళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. రూ.కోట్లు వెచ్చిస్తున్నా పనులు మాత్రం కొలిక్కి రావడం లేదు. దీంతో ఓ వైపు స్మార్ట్ కళ సంగతి అటుంచితే..ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. 2015-16లో స్మార్ట్ సిటీగా కాకినాడ ఎంపికైంది. ఈ నగరపాలక సంస్థ పరిధిలో రూ. వందల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రాజెక్టు 2019-20 ఆర్థిక సంవత్సరంతో పూర్తికావాల్సి ఉంది. కానీ ఈ పనులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. సాంకేతికతతో కూడిన కొన్ని ప్రాజెక్టులు కార్యరూపం దాల్చినా వాటి సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. సాధారణ పనులకే ప్రాధాన్యం ఇస్తూ రూ.కోట్లు వెచ్చించడం విమర్శలకు తావిస్తోంది.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో చోటుదక్కించుకున్న కాకినాడ నగరంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.333.43 కోట్లు వెచ్చించి పనులు పట్టాలెక్కించారు. ప్రతి పనికీ ఆడిట్‌ సమర్థంగా సాగుతోందని సంబంధిత అధికారులు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం అవసరం లేని పనులకు సైతం నిధులు ఖర్చుచేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనుల గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నాటికి పనులన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యం కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ యంత్రాంగం ముందుంది. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా కాకినాడలో వివేకానంద, గాంధీనగర్‌ ఉద్యానవనాల పునరుద్ధరణ, పచ్చదనం అభివృద్ధి పనులు రూ.18.99 కోట్లతో చేపట్టారు. ఈ ప్రాంగణాలు నగర వాసులకు సాయంత్రం వేళల్లో.. వారాంతపు సెలవు రోజుల్లో సేదతీరేందుకు ఉపకరిస్తున్నాయి. రూ.11.44 కోట్లతో వర్చువల్‌, డిజిటల్‌ తరగతి గదులు, కంప్యూటర్‌ ల్యాబ్‌, స్టూడియో ఏర్పాటు చేశారు. వీటికి అవసరమైన సిబ్బంది లేకపోవడం, నిర్వహణలో ప్రణాళిక లోపం కనిపిస్తోంది. రూ.కోట్ల వ్యయంతో వాటర్‌ వర్క్స్‌ ప్రాంగణంలో కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల వ్యవస్థ ద్వారా నగరంలోని వాహనాల రాకపోకలు, ట్రాఫిక్‌పై నిరంతర పర్యవేక్షణను ఇక్కడ చేపట్టాల్సి ఉంది. వాతావరణ హెచ్చరికలు కూడా జారీచేసి ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థ ఇక్కడ ఉన్నా ఈ కేంద్రం సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. నగరపాలక ఉన్నత పాఠశాలల్లో మూడు ప్యాకేజీల కింద రూ.11.53 కోట్లతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు. ప్రాథమిక పాఠశాలల స్థితిగతులనూ మెరుగుపరచాల్సి ఉంది. స్మార్ట్‌ సిటీ మిషన్‌ ఆధ్వర్యంలో అచ్చంపేట కూడలి నుంచి సర్పవరం జంక్షన్‌ వరకు రూ.9 కోట్లతో అభివృద్ధి చేశారు. సర్పవరం జంక్షన్‌ నుంచి జగన్నాథపురం వంతెన వరకు..ఇతర రహదారుల అభివృద్ధి పనులు రూ.100 కోట్లతో చేపట్టారు.ఈ పనులు పూర్తికావాల్సి ఉంది. నిర్మాణ, నిర్వహణ లోపం కారణంగా వర్షం పడితే ఎక్కడికక్కడ నీరు పొంగి నిలిచిపోతోంది. దీంతో సిబ్బంది అప్పటికప్పుడు ఈ పనులను చేపట్టాల్సి వస్తోంది. రూ.5.63 కోట్లతో ప్రతాప్‌నగర్‌ వంతెన పూర్తవడంతో రాకపోకల సమస్య పరిష్కారమైంది. ప్రధాన పార్కుల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఉదయపు నడక, ఆటవిడుపునకు వెళ్లేవారికి ఇవి వ్యాయామాలకు ఉపయోగపడుతున్నాయి. రూ.6.36 కోట్లతో ఈ-రిక్షాలు, ఈకార్ట్‌-కార్గోలను అందుబాటులోకి తెచ్చినా సమర్థంగా వినియోగించే పరిస్థితి నగరంలో కనిపించడం లేదు. పెద్ద మార్కెట్‌, కొత్తపేట, గాంధీనగర్‌ మార్కెట్లతో పాటు.. పల్లిపేట, వాడపేట, రెల్లిపేట, ఏటిమొగ తదితర మురికివాడల అభివృద్ధికి రూ.కోట్లు వెచ్చించారు. ఈ పనులు నిత్యం రాకపోకలు సాగించే వారికి ఊరటనిచ్చిన అంశం.

Related Posts