సేవలు సున్నా (కడప)
కడప, ఫిబ్రవరి 06 : జిల్లాలో పేద ప్రజల పాలిట వైద్య సంజీవని కడప సర్వజన ఆసుపత్రి (రిమ్స్).. వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించుకోలేని వారంతా ఇక్కడి ఎంతో ఆశగా వస్తుంటారు. సామాన్యులు ఖరీదైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోకూడదనే దృఢ సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వందల ఎకరాల్లో రిమ్స్ పేరిట ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ వైద్యం బాగానే అందుతోంది, అత్యాధునిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో ఆసుపత్రికి వైద్యానికి వస్తున్నారు. ప్రతిరోజూ వెయ్యి నుంచి 12 వందల మందికి పైనే ఓపీకి వస్తున్నారు. 600 నుంచి ఎనిమిది వందల దాకా ఐపీ విభాగానికి వస్తున్నారు. వసతులన్నీ ఉన్నా ఇక్కడ కొన్ని సమస్యలు రోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా రేడియాలజీ విభాగంలోని వైద్యుల కొరత రోగులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రేడియాలజీ విభాగంలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏడుగురు, ట్యూటర్లు ఇద్దరు చొప్పున మొత్తం 12 మంది పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆయన కూడా వారంలో రెండు లేదా మూడు రోజులు కోర్టు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ట్యూటర్ మొత్తం ముగ్గురు ఉండే వారు. వారిలో ట్యూటర్ ఉపనియుక్తంపై నెల్లూరుకు వెళ్లగా, మరొకరు సెలవుపై వెళ్లారు. దీంతో ఒక్కరు మాత్రమే విధుల్లో ఉన్నారు. సాధారణంగా రేడియాలజీ విభాగంలోని వైద్యులకు నెల రోజుల రేడియేషన్ సెలవులు ఉంటాయి. ఉన్న ఒక్కరు కూడా రేడియేషన్ సెలవుపై వెళితే పరిస్థితి ఏమిటని కొందరు వైద్యులు అంటున్నారు. డెప్యుటేషన్ రద్దు చేయించి ఇక్కడి వైద్యులను విధులకు పిలిపిస్తే రోగుల ఇబ్బందులు తగ్గుతాయని కొందరు వైద్యులు అంటున్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని నర్సులు, వైద్యులు, ఇతర సిబ్బంది కొరతను జనవరి నెలలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు రెండు నెలల కిందట హామీ ఇచ్చారు. జనవరి నెల ముగుస్తున్నా ఇంత వరకు ఆ ప్రస్తావనే లేదు. ఆసుపత్రిలో అన్ని విభాగాల్లో సిబ్బంది కొరత అధికంగానే ఉంది. ఎప్పుడు సిబ్బంది వస్తారా..? అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రక్తపరీక్షల విభాగం, నర్సులు, రేడియాలజీ విభాగంలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. వందల రూపాయలు ఖర్చు చేసుకుని, ఎన్నో శ్రమలను ఓర్చి సుదూర ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వచ్చి వైద్యం అందక ఉసూరుమంటూ వెనక్కి వెళుతున్న రోగుల సంఖ్య అధికంగా ఉంది. ముఖ్యంగా ఆసుపత్రికి గర్భిణులు అధికంగా వస్తున్నారు. వారికి ప్రసవించేలోగా కనీసం రెండుమూడుసార్లు స్కానింగ్ తప్పనిసరిగా చేయించాలి. చాలా మంది పేదలు ప్రైవేట్‌లో వేలాది రూపాయలు ఇచ్చుకోలేక స్కానింగుకు ఇక్కడికే వస్తారు. దాదాపు రోజుకు 80 నుంచి వంద మంది గర్భిణులు స్కానింగ్‌కు వస్తారు. మిగిలిన విభాగాల నుంచి ప్రతిరోజూ 150 నుంచి రెండు వందల మంది దాకా స్కానింగ్ కోసం వైద్యులు పంపుతారు. సిబ్బంది కొరత కారణంగా వచ్చిన వారిలో 30 నుంచి 40 మందికి మాత్రమే స్కానింగ్ జరుగుతోంది. మిగిలిన వారు రెండు లేదా మూడు రోజులు ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిందే.