YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కష్టాల కాళేశ్వరం

కష్టాల కాళేశ్వరం

కష్టాల కాళేశ్వరం (నిజామాబాద్)
నిజామాబాద్, ఫిబ్రవరి 06: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని శ్రీరాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌ను ఉపయోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. నవీపేట మండల బినోల వద్ద అప్రోచ్‌ కాలువతో మొదలై.. మోపాల్‌ మండలం మంచిప్ప పరిసరాల్లో 3.5 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి కుడి, ఎడమ పైపులైన్లతో నిజామాబాద్‌ గ్రామీణం, బాల్కొండ మీదుగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వరకు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాలని ప్రణాళికలు రూపొందించారు. దీనిలో భాగంగా కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనులు వ్యవసాయ క్షేత్రాల్లో కొనసాగుతున్నాయి. తమ ప్రారతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడానికి ఇష్టం లేక రైతులు నష్టాలను సైతం కష్టంగా భరిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కర్షకులు వాపోతున్నారు. ప్యాకేజీ 21 పనులు నత్తనడకన సాగుతుండటం, భారీ యంత్రాలను ఇష్టానుసారంగా తిప్పుతుండటంతో సాగుభూములు ఛిద్రమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత కురిసిన వర్షాలతో భూగర్భజలాలు పెరగడంతో రైతులు రబీపై ఆశలు పెట్టుకున్నారు. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో భారీ గుంతలు తీసి మట్టిని పక్కనే వేస్తుండటంతో సన్నకారు రైతులు చితికిపోతున్నారు. వరినాట్ల దశలో పనులు చేపట్టడంతో నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. సగటున ఒక కిలోమీటర్‌ పైపులైన్‌ వేయడానికి రెండు ఎకరాల వ్యవసాయభూమి ఛిద్రమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 90 కి.మీ పైపులైన్‌ వేయడానికి 180 ఎకరాలు నిరూపయోగంగా మారుతోంది. సబ్‌పైపులైన్‌ వేయడానికి కిలోమీటర్‌కు ఎకరన్నర చొప్పున మొత్తం 285 ఎకరాలకు నష్టం వాటిల్లుతుందని ప్రాథమిక సమాచారం. ముందస్తుగా ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో రైతులు అభివృద్ధి పనులకు పూర్తిగా సహకరిస్తున్నారు. అయితే పైపులైన్‌ పనులకు ఎంత భూమి వాడుకుంటున్నారు? పరిహారం ఏమైనా ఇస్తారా? ఇస్తే ఎంత మొత్తం చెల్లిస్తారనే వివరాలను తెలపాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Related Posts