జమ్మూ, వారణాశిలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు
టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్
తిరుమల ఫిబ్రవరి 7
జమ్మూతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాశిలో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించిందని, ఈ మేరకు చర్యలు ప్రారంభించామని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో మాట్లాడారు. ఇప్పటికే హైదరాబాద్, కురుక్షేత్ర, కన్యాకుమారిలో శ్రీవారి ఆలయాల నిర్మాణం పూర్తి చేసి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని ఈవో తెలిపారు. కురుక్షేత్రలో వేదపాఠశాల కూడా ప్రారంభిస్తామన్నారు. భువనేశ్వర్, చెన్నై, వైజాగ్‌లో శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో 650 గజాల స్థలాన్ని కేటాయించిందని, అక్కడ రూ.30 కోట్లతో ఆలయ నిర్మాణం చేపడతామని తెలియజేశారు. కాగా, జమ్మూ రాష్ట్ర ప్రభుత్వం మొదట 7 స్థలాలను గుర్తించిందని, ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులు, స్థపతితో కూడిన బృందం వెళ్లి నాలుగు స్థలాలను ఎంపిక చేశారని చెప్పారు. మరోమారు టిటిడి అధికారుల బృందంతో శుక్రవారం జమ్మూకు వెళుతున్నామని, శ్రీవారి ఆలయం, ఇతర కార్యక్రమాలకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసి అక్కడి అధికారులకు తెలియజేస్తామని తెలిపారు. ఈ సంవత్సరంలోపే ఆలయ పనులు ప్రారంభిస్తామన్నారు. శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గదులను బుక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలని ఈవో కోరారు. నకిలీ వెబ్‌సైట్లను సంప్రదించి మోసపోయినట్టు పలువురు భక్తుల నుండి టిటిడికి ఫిర్యాదులు అందాయని, వీటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించామని తెలిపారు. రథసప్తమి సందర్భంగా భక్తులకు విశేషంగా సేవలందించిన టిటిడి అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, పోలీసులకు ఈవో ధన్యవాదాలు తెలియజేశారు. 2.25 లక్షల మంది భక్తులు రథసప్తమినాడు వాహనసేవలను తిలకించారని, 95 వేల మంది భక్తులు మూలమూర్తిని దర్శించుకున్నారని వివరించారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 14 నుండి 22వ తేదీ వరకు, తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 14 నుంచి 23వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, పరిసర ప్రాంతాల భక్తులు విచ్చేసి వాహనసేవలను తిలకించాలని కోరారు. శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని మార్చి మొదటివారంలో భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఫిబ్రవరి 11, 25వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు, ఫిబ్రవరి 12, 26వ తేదీల్లో 5 ఏళ్లలోపు చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అదనంగా దర్శనం కల్పిస్తామని తెలిపారు.