ఏప్రిల్ 30 నుంచి బద్రీనాధ్ దర్శనం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7
ఏప్రిల్ 30న ఉత్తరాఖండ్ లోని పవిత్ర పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో శీతాకాలం రాకముందు వరకూ ప్రతి సంవత్సరం ఆరు నెలల పాటు మందిరం తెరిచే ఉంటుంది. బద్రీనాథ్ ఆలయ పునఃప్రారంభంపై బద్రి - కేదార్ ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన్ ప్రసాద్ తప్లియాల్ మాట్లాడుతూ... ఏప్రిల్ 30న తెల్లవారుజామున 4.30 గంటలకు వేద మంత్రోశ్చారణల మధ్య ఆలయ తలుపులు వేడుకగా తెరుస్తామని తెలిపారు.ఈ ఆలయం సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో యాత్రికులు, పర్యాటకుల కోసం తెరుచుకుంటుంది. నవంబర్ మధ్యలో శీతాకాలం ప్రారంభ సమయంలో ఈ ఆలయం మరలా మూసివేయబడుతుంది. శీతాకాలంలో ఆలయం మూసివేయబడినప్పటికీ జోషి మఠ్ లోని నరసింహ ఆలయంలో రోజువారీ ఆచారాలు కొనసాగుతాయి.పూర్వం నుంచి ఆలయ పూజారులుగా కొనసాగుతున్న తెహ్రి రాజ కుటుంబానికి చెందిన ఆచార్య కృష్ణ ప్రసాద్ ఉనియల్, సంపూర్ణనంద్ జోషి వసంత పంచమి పర్వదినం రోజున ఆలయ పునఃప్రారంభ తేదీను ప్రకటించినట్లు తప్లియాల్ తెలిపారు.సముద్రమట్టానికి 10279 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మందిరం చార్ ధామ్ తీర్ధయాత్ర ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మిగిలిన మూడు దేవాలయాలు కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఈ నాలుగు ప్రదేశాలను సందర్శించడాన్ని చార్ ధామ్ యాత్ర అని అంటారు. ప్రతి ఏటా ఈ యాత్ర చేసేందుకు లక్షలాది సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రముఖ వైష్ణవ క్షేత్రం అన్ని రకాల రవాణా సౌకర్యాలతో అనుసంధానించబడి ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. సామాన్య ప్రజలు బద్రీనాథ్ కు చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలను ఉత్తమమైన ఎంపికలుగా పరిగణిస్తారు.