అనంత నీటి కష్టాలు
800 అడుగుల్లో నీరు పడట్లేదు..
అనంతపురం,
ఖరీఫ్‌లో వర్షాలు లేక సాగు చేసిన వేరుశెనగ పంటలన్నీ ఎండిపోయాయ్. మరో వైపు భగభగ మండుతున్న ఎండలకు బోర్లలో నీళ్లు ఆవిరి కావడంతోపాటు పొలంలో వేరే చోట బోరు వేయిస్తే నీళ్లు వస్తాయేమోనని కొండంత ఆశతో మరిన్ని బోర్లు వేయించినా నీటి చుక్క కనిపించడం లేదుఅదేవిధంగా కనీసం బోరుబావుల కింద అయినా పంటను సాగుచేసి చేసిన అప్పులు తీర్చుకుందామని ఆశించిన రైతన్నల బతుకులూ ప్రస్తుతం ఎండిపోతున్నాయ్. జిల్లాలోనే అత్యల్ప వర్షపాతం నమోదైన నల్లమాడ మండలంలో ఇలాంటి సంఘటన ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. మండలంలోని సోమగుట్టపల్లికి చెందిన రైతన్న జయరామిరెడ్డి తన పొలంలో గతంలో వేయించిన బోరులో నీళ్లు సంవృద్ధిగా వస్తుండటంతో 7 ఎకరాల పొలంలో వేరుశెనగను సాగుచేశాడు. పంటను సాగు చేసిన నెల రోజుల వరకు నీళ్లు బాగానే వచ్చాయి. సాగు చేసిన పంట కూడా పచ్చగా కళకళలాడటంతో పంటల సాగు కోసం చేసిన అప్పులన్నీ తీర్చుకుని సంతోషంగా వుండొచ్చని రైతు ఆశించాడు. అయితే నెల రోజుల తర్వాత బోరులో ఒక్క చుక్క నీరు కూడా బైటికి రాలేదు. పచ్చగా కళకళలాడుతున్న వేరుశెనగ పంటను వదిలేయలేక అప్పు చేసి మరో బోరు సుమారు 800ల అడుగుల లోతుకు వేయించాడు. అందులో కూడా చుక్క నీరు కూడా రాకపోవడంతో పంటను పూర్తిగా దునే్నశాడు. దీంతో వేరుశెనగ సాగుకు, కొత్త బోరుకు రూ. 2లక్షల వరకు అప్పు చేయాల్సిన దుస్థితి నెలకొంది. అదే గ్రామానికి కూతవేటు దూరంలో వున్న కుటాలపల్లి మండలంలో పంటల సాగుకు ప్రసిద్ధిగాంచింది. ఆ గ్రామంలోని రైతులకు కేవలం వ్యవసాయమే జీవనోపాధి. అనునిత్యం సుమారు 4 వేల ఎకరాల్లో మల్బరీ, వేరుశెనగ, టమోటా, మిర్చి, వంగ తదితర పంటలు సాగులో వుండేవి. ఆ గ్రామ పరిధిలోని రైతన్నలకు చెందిన సుమారు వెయ్యి బోర్లకు పైగా వున్నాయి. వాటన్నింటిలో కూడా నీళ్లు రాకపోవడంతో ఆ గ్రామానికి చెందిన పలువురు రైతన్నలు ఆశతో మరిన్ని బోర్లను వేయించినా ప్రయోజనం శూన్యం. పంటల సాగుకు, బోర్ల కోసం చేసిన అప్పులు తీర్చడానికి పొట్ట చేతపట్టుకుని బతుకుజీవుడా అని రైతన్నలు వలస బాట పడుతున్నారు. అదేవిధంగా నల్లమాడ, రెడ్డిపల్లి, వేళ్ళమద్ది, యర్రవంకపల్లి, గోపేపల్లి, పులగంపల్లి, దొన్నికోట పంచాయతీల పరిధిలోని గ్రామాల ప్రజలు మండలంలో జీవనోపాధి కరువై బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌లాంటి ప్రదేశాలకు వలసలు వెళ్ళడంతో ఆ గ్రామాలు సగానికి సగం ఖాళీ అయ్యాయి. కుటాలపల్లి, రెడ్డిపల్లి, చారుపల్లి, దొన్నికోట, నల్లమాడ, చెండ్రాయునిపల్లి గ్రామాల పరిధిలో పెద్ద పెద్ద చెరువులున్నాయి. ఈ చెరువుల్లో నీళ్లు చేరితే నల్లమాడ మండల వ్యాప్తంగా నీటి కరవును తరిమికొట్టచ్చు.