వైభవంగా పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
యాదాద్రి ఫిబ్రవరి 8
యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామిఅమ్మవార్ల కల్యాణ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. రాత్రి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి. అంతకుముందు స్వామివారు గజవాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ కల్యాణ మండపానికి చేరుకున్నారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామిఅమ్మవార్లను అధిష్టింపజేసి కల్యాణ ఘట్టాన్ని ఆరంభించారు అర్చకులు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణాలు, మంగళవాయిద్యాల కళతాళ ధ్వనుల మధ్య ముళ్లోకాది దేవతలు చూస్తుండగా సరిగ్గా తులా లగ్న సుముహూర్తమున నరసింహస్వామివారు లక్ష్మీఅమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. ఆ సమయంలో పాతగుట్ట కల్యాణ మండపం "నమో నారసింహ, జై నారసింహ, గోవిందా" నామస్మరణతో మార్మోగింది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, కలెక్టర్ అనితారామచంద్రన్, పలువురు వీఐపీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో కల్యాణ మండపం కిక్కిరిసిపోయింది. స్వామిఅమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు తమ జన్మ ధన్యమైందని భావిస్తూ ఆనందపరవశులైనారు. సమస్త దేవతలు, మహర్షులు, ప్రకృతిలోని ప్రాణకోటి మొత్తం ఈ కల్యాణ వేడుకను తనివితీరా వీక్షించి పరవశించారని వేదపండితులు భక్తులకు ప్రవచించారు. లోక కల్యాణం, జగత్ రక్షణ కోసం స్వామివారు లక్ష్మీదేవి మెడలో మంగళసూత్రధారణ గావించారని, స్వామివారి కరుణాకటాక్షములు అమ్మవారితో పాటు సమస్త లోకాలు సంతరిస్తాయని అర్చకులు వివరించారు.