శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి
తిరుమల జనవరి 08
కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది. ''శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి'' ప్రతి ఏటా మాఘ మాసంలో నిర్వహించడం ఆనవాయితి. ఈ పుణ్యతీర్థం స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసివున్నది. ఆశ్లేష నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినాన్ని ఆలయ ఆర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మానవులు అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించినందు వల్ల కలిగిన దోషాల నివారణకు ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరిస్తారని ప్రాశస్త్యం. ఈ పర్వదినంనాడు ఉదయం 7 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రితో బయల్దేరతారు. శ్రీరామకృష్ణ తీర్థానికి చేరుకుని అక్కడ వెలసివున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు.