ద్రవిడ వేదం నాలాయిర దివ్యప్రబంధం
ఫిబ్రవరి 9న పౌర్ణమి గరుడసేవలో 200 మందికిపైగా పండితుల పారాయణం
తిరుమల ఫిబ్రవరి 8
దక్షిణభారతంలో ముఖ్యంగా తమిళనాడులో దివ్య ప్రబంధాన్నివేదాలతో సమంగా పరిగణిస్తారు. అందుకే దీనిని ద్రవిడ వేదం అన్నారు. శ్రీరంగం తదితర ఆలయాల్లో ప్రతినిత్యం విధిగా ఈ దివ్య ప్రబంధాన్నిఉచ్చరించడం భగవత్సేవలో ఒక ముఖ్యమైన భాగం. 8వ శతాబ్దానికి ముందు 12 మంది ఆళ్వారులు రచించిన 4 వేల పాశురాల సమాహారం నాలాయిర దివ్య ప్రబంధం. తమిళంలో నాలాయిరం అనగా నాలుగు వేలు. శ్రీమహావిష్ణువును, వారి అనంత రూపాలను కీర్తించే ఈ దివ్య ప్రబంధాన్ని ఆళ్వార్లు పలు ఆలయాల్లో గానం చేశారని, అలా గానం చేసిన ప్రాంతాలను దివ్యదేశాలంటారని టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, హెచ్‌డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్ తెలిపారు.
ఈ దివ్యప్రబంధానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు టిటిడి 2010వ సంవత్సరంలో నాలాయిర దివ్యప్రబంధ పారాయణ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో ప్రస్తుతం 230 మంది పండితులు దేశవ్యాప్తంగా పలు వైష్ణవాలయాల్లో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తున్నారు. 2016వ సంవత్సరంలో అప్పటి ఈవో డా. డి.సాంబశివరావు ఆదేశాల మేరకు ఈ పండితులందరినీ తిరుమలకు ఆహ్వానించి పౌర్ణమి గరుడసేవలో సామూహికంగా ప్రబంధ పారాయణం చేయించారు. ఇప్పటివరకు మూడుసార్లు ఈ కార్యక్రమం నిర్వహించారు.
నాలుగో సారి దివ్యప్రబంధ మహోత్సవం
శ్రీవారి 4వ నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం ఆదివారం పౌర్ణమి గరుడసేవలో వైభవంగా జరుగనుంది. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నాలాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని దాదాపు 200 మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పారాయణదారులు విచ్చేయనున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకు తిరుమలలోని ఆస్థానమండపంలో నాలాయిర దివ్యప్రబంధ పారాయణదారులతో సమావేశం, దివ్యప్రబంధ పారాయణం నిర్వహిస్తారు. టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి విచ్చేసి తమ సందేశాలిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు దివ్యప్రబంధ గోష్ఠిగానం నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగనున్న శ్రీవారి పౌర్ణమి గరుడసేవలో జీయర్‌స్వాముల వెంట పండితులు దివ్యప్రబంధ పారాయణం చేస్తారు.