అమరావతి భూములు.. స్పీడ్ పెంచిన సీఐడీ
విజయవాడ, ఫిబ్రవరి 8
అమరావతిలో భూముల కొనుగోళ్లపై సీఐడీ దూకుడు పెంచింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో డొంక కదిలిస్తున్న దర్యాప్తు సంస్థ.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోళ్లపై విచారణ చేయాలని కోరుతూ ఐటీ చీఫ్ కమిషనర్‌కు.. సీఐడీ అడిషనల్ డైరెక్టర్ సునీల్ కుమార్ లేఖ రాశారు. ఆ ప్రాంతంలో 106 మంది 2018 నుంచి 2019 వరకు కొనుగోలు చేసిన భూముల వివరాలను కూడా అందజేశారు. ప్రధానంగా ఈ భూములపైనే విచారణ చెయ్యాలని కోరారఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అమరావతిలో అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. భూముల కొనుగోళ్లలో రూ. 2లక్షలకు మించి జరిగిన లావాదేవీలపై దర్యాప్తు చేయాలని ఐటీ అధికారులకు సీఐడీ ఏడీ విజ్ఞప్తి చేశారు. అమరావతిలో భూముల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే ఈడీకి సీఐడీ లేఖ రాసింది.. తాజాగా ఐటీకి లేఖ పంపింది. దీంతో అసైన్డ్ భూముల వ్యవహారంలో ఐటీ రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసుపై సీఐడీ విచారణలో దూకుడు మరింత పెంచింది. ఇప్పటికే మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలతో పాటు మరికొందరిపైకేసు నమోదు చేసిన దర్యాప్తు సంస్థ.. తాజాగా మరో ఐదుగురిపై కేసు నమోదు చేసింది. వీరు కృష్ణా జిల్లా విజయవాడ, పెనమలూరు, పోరంకి, యనమలకుదురు ప్రాంతాలకు చెందిన వారని తెలిసింది.అమరావతిలో భూములు కొనుగోళ్ల వ్యవహారంలో సీఐడీ విచారణతో టీడీపీ నేతల్లో గుబులు మొదలయ్యింది. మాజీ మంత్రులపై కేసులు నమోదు కావడం.. మరికొంతమంది టీడీపీ నేతలు కూడా ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయనే ప్రచారంతో టెన్షన్ మొదలయ్యింది. ఈడీ, ఐటీ కూడా రంగంలోకి దిగితే మొత్తం వ్యవహారం బయటపడుతుందని వైఎస్సార్‌సీపీ చెబుతోంది.