ఆడవాళ్లకు భద్రత కల్పించేందుకే దిశ
రాజమండ్రి, ఫిబ్రవరి 8
మహిళలక రక్షణగా జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది. ఆడవాళ్ల భద్రతకు భరోసా ఇచ్చేందుకు దిశ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. తాజాగా దిశ పేరుతో పోలీస్ స్టేషన్లకు శ్రీకారం చుట్టింది. తొలి పీఎస్‌ను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేయగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యింది. అంతేకాదు మహిళల కోసం దిశ యాప్‌ను సిద్ధం చేశారు.. దీనిని సీఎం జగన్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, డీజీపీలు పాల్గొన్నారు.దిశ చట్టాన్ని అనుసరించి ఈ పోలీస్ స్టేష్లు ఏర్పాటు చేశారు. అదనంగా ఐపీసీ 354ఎఫ్, 354జీ సెక్షన్లు ఏర్పాటు చేసి.. దిశ చట్టం కింద కేసు నమోదైతే పర్యవేక్షణ డీఎస్పీ స్ధాయిలో ఉంటుంది. అలాగే 13మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.. మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు.. విశాఖ, తిరుపతిలో కొత్తగా డీఎన్‌ఏ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.జగన్ సర్కార్ దిశ బిల్లును తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పక్కా ఆధారాలు ఉంటే.. అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేయడంతోపాటు.. 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసి.. 21 రోజుల్లోనే శిక్షలు ఖరారవుతాయి. గతంలో ఈ కేసుల విచారణకు 4 నెలల సమయం పడుతుండగా.. ఇక నుంచి మూడు వారాల్లోనే తీర్పు వెలువడుతుంది. అలాగే మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం జిల్లాకో కోర్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ న్యాయస్థానాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లా పని చేస్తాయి. మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలను మాత్రమే ఈ కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి.మహిళలు, చిన్నారులను కించపరుస్తూ.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం గరిష్టంగా ఐదేళ్ల శిక్ష మాత్రమే పడుతుంది. కాగా.. నేరాల్లో తీవ్రతను బట్టి వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా బిల్లు రూపొందించారు.ఏపీ ప్రభుత్వం దిశ చట్టానికి ప్రత్యేకంగా రూ.58కోట్లు కేటాయించింది.. ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేస్తున్నారు. మొదటిగా రాజమండ్రిలో ఈ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. మహిళలకు సంబంధించిన ఫిర్యాదులను ఇక్కడ స్వీకరిస్తారు. దిశ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం ఇద్దరు మహిళా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, 2014 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎం.దీపికను దిశ చట్టం అమలు బాధ్యతల పర్యవేక్షణ కోసం నియమించారు.