రెండో వన్డేలో కివీస్ గెలుపు, సిరీస్ కైవసం
హైద్రాబాద్, ఫిబ్రవరి 8
న్యూజిలాండ్ గడ్డపై వన్డే సిరీస్‌లో భారత్ జట్టు గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. ఆక్లాండ్ వేదికగా శనివారం జరిగిన రెండో వన్డేలో 274 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా.. ఒకానొక దశలో 129/6తో నిలిచినా.. రవీంద్ర జడేజా (55: 73 బంతుల్లో 2x4, 1x6), నవదీప్ సైనీ (45: 49 బంతుల్లో 5x4, 2x6) దూకుడుగా ఆడటంతో గెలిచేలా కనిపించింది. కానీ.. ఆఖర్లో మళ్లీ పుంజుకున్న కివీస్ బౌలర్లు భారత్‌ని 48.3 ఓవర్లలో 251కే ఆలౌట్ చేశారు. దీంతో.. 22 పరుగుల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్ జట్టు.. మూడు వన్డేల సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకుంది. ఇక ఆఖరి మ్యాచ్ మంగళవారం ఉదయం 7.30 గంటల నుంచి బే ఓవల్ వేదికగా జరగనుంది.అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. మార్టిన్ గప్తిల్ (79: 79 బంతుల్లో 8x4, 3x6) రాస్ టేలర్ (73 నాటౌట్: 74 బంతుల్లో 6x4, 2x6) హాఫ్ సెంచరీలు బాదడంతో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేయగలిగింది. మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వరుసగా వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. ఆఖర్లో రాస్ టేలర్ దెబ్బకి మళ్లీ లయ తప్పారు. తొలి వన్డేలో శతకం బాదిన టేలర్.. కివీస్‌ని గెలిపించిన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు పడగొట్టగా.. శార్ధూల్ ఠాకూర్ రెండు, జడేజా ఒక వికెట్ తీశాడు. గప్తిల్; జేమ్స్ నీషమ్ రనౌట్‌గా వెనుదిరిగారు.274 రన్స్ ఛేదనలో భారత్‌కి ఓపెనర్లు పృథ్వీ షా (24), మయాంక్ అగర్వాల్ (3) మెరుగైన ఆరంభాన్నివ్వలేకపోయారు. అనంతరం వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (15), కేఎల్ రాహుల్ (4) కూడా తేలిపోగా.. శ్రేయాస్ అయ్యర్ (52: 57 బంతుల్లో 7x4, 1x6) ఫామ్‌ని కొనసాగిస్తూ హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించాడు. కానీ.. మిడిల్ ఓవర్లలో అతనికి సీనియర్ల నుంచి సహకారం కరువైంది. కేదార్ జాదవ్ (9) వరుసగా రెండో వన్డేలోనూ నిరాశపరిచాడు. అయితే.. శ్రేయాస్ ఔట్ తర్వాత భారత్ జట్టు స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకున్న జడేజా.. ఆఖరి వరకూ పోరాడాడు. అతనికి కాసేపు శార్ధూల్ ఠాకూర్ (18), నవదీప్ సైనీ (45), చాహల్ (10) మంచి సహకారం ఇచ్చినా.. ఆఖర్లో పరుగులు, బంతులు మధ్య అంతరం పెరిగిపోయింది. దీంతో.. 49వ ఓవర్‌లో హిట్టింగ్‌కి ప్రయత్నించిన జడేజా.. సిక్స్ కొట్టే ప్రయత్నంలో జట్టు స్కోరు 251 వద్ద ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు