YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పువ్వాడ...బెడిసి కొట్టిన ప్రయోగం

పువ్వాడ...బెడిసి కొట్టిన ప్రయోగం

పువ్వాడ...బెడిసి కొట్టిన ప్రయోగం
హైద్రాబాద్, ఫిబ్రవరి 8

అధిష్ఠానం మెప్పు పొందేందుకు కింది స్థాయి నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. పదవుల కోసం కానీ.. లేదా పార్టీలో సముచిత స్థానం కోసం కానీ.. మంచి పనులు చేస్తూ అధినేత దృష్టిలో పడాలని అందరూ కోరుకుంటుంటారు. అయితే, ఒక్కోసారి ఆ ప్రయత్నాలు బెడిసికొడుతుంటాయి కూడా!! తాజాగా ఇలాంటి పరిణామమే తెలంగాణలో జరిగింది! ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనే లక్ష్యంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించగా.. చివరికి అది నష్టాన్ని కలిగించిందని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌‌లో చేరిన నేతల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఉన్నారు. పార్టీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఈయనకు కేబినెట్‌లో చోటు దక్కింది. తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2016లో పువ్వాడ గులాబీ కండువా కప్పుకున్నారు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం కేబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా స్థిరపడ్డారు.ఆయన మంత్రివర్గంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నుంచి సమ్మె పేరుతో నోట్ వచ్చింది. తమ డిమాండ్లను పరిష్కరించాలనేది దాని సారాంశం. ముందస్తు నోటీసు ప్రకారమే ఆర్టీసీ కార్మికులు గత అక్టోబరులో సమ్మెకు వెళ్లి చరిత్రలోనే అత్యంత తీవ్రమైన, పెద్ద సమ్మెగా మార్చారు. ఈ క్రమంలో పువ్వాడ నిర్ణయాలు ప్రభుత్వాన్ని కొంత ఇబ్బంది పెట్టినట్లుగా పార్టీ వర్గాలు విశ్వసనీయంగా వెల్లడించాయి. ఇదే సమయంలో పువ్వాడకు కేటాయించిన రవాణా శాఖ మారుతుందనే ప్రచారమూ సాగింది. అదే సమయంలో సీఎం వ్యూహాత్మకంగా కార్మికుల సమ్మెకు తెరపడడంతో ఆ ప్రయత్నం సమసిపోయినట్లుగా సమాచారం. ఆర్టీసీలో వెయ్యి బస్సులను రవాణా బస్సులుగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సంస్థను నష్టాల నుంచీ గట్టెక్కించే చర్యల్లో భాగంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పని తీరు సరిగ్గా లేని బస్సులకు బాహ్య ఆకృతి మార్చి కొత్తగా డిజైన్ చేశారు. వీటికి ఎరుపు రంగు వేసి, టీఎస్‌ఆర్టీసీ లోగోను కూడా ముద్రించారు. ప్రస్తుతానికి 50 బస్సులను కార్గో బస్సులుగా మార్చారు.ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన ప్రకటన దుమారం రేపింది. ఆర్టీసీ ఉన్నతి కోసం ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలెన్నో తీసుకున్నారని, టీఎస్ఆర్టీసీకి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకే ఆ కార్గో బస్సులపై కేసీఆర్ బొమ్మలను కూడా ముద్రిస్తామని ప్రకటించారు. కొన్ని బస్సులపై కేసీఆర్ చిత్రాలను కూడా అంటించారు. పువ్వాడ ప్రకటనపై విపక్షాలు దుమ్మెతిపోశాయి. దీంతో సీఎం తరపున ఆయన కార్యాలయం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. బస్సులపై బొమ్మలు వేసుకొని ప్రచారం పొందే చవకబారు తత్వం తనకు లేదని సీఎం అన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. చక్కటి సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజలకు సేవలు అందించాలే తప్ప, ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని స్పష్టంగా చెప్పారు.ముఖ్యమంత్రి అభిప్రాయంతో సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి శ్రీ పి.రాజశేఖర్ రెడ్డి ఆర్టీసీ ఎండీకి నోట్ పంపారు. కార్గో బస్సులపై ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించరాదని ఆదేశించారు. దీంతో సీఎం మెప్పు పొందాలనే తన ప్రయత్నం బెడిసికొట్టినట్లయిందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బస్సులపై తన ఫోటోలు కాకుండా లాభాల బాటలో నడిపించేలా పని చేయాలని హిత బోధ చేసినట్లు తెలుస్తోంది. పువ్వాడ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల విపక్షాలకు అవకాశమిచ్చినట్లయిందని కేసీఆర్‌ ఆయనపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Related Posts