YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 కల్తీ మాయ (నల్గొండ)

 కల్తీ మాయ (నల్గొండ)

 కల్తీ మాయ (నల్గొండ)
నల్గొండ, ఫిబ్రవరి 08 (న్యూస్ పల్స్): జిల్లాలో కల్తీ, కృత్రిమ కల్లు తయారీ మందుల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఏటా రూ.కోట్లలో కల్లుమందు అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. ఈ దందాలో నకిరేకల్‌ కీలకంగా మారింది. కల్తీ కల్లు తయారీలో వాడే క్లోరల్‌హైడ్రేట్‌, డైజోఫాం, ఇతర రసాయనాల వ్యాపారం రెండు దశాబ్దాలుగా ఇక్కడ సాగుతోంది. దశాబ్దన్నర క్రితం కల్తీకల్లు సేవించి ఈ ప్రాంతానికి చెందిన ఆబ్కారీ ఎస్సై మృత్యువాత పడ్డారు. పేదల ఆరోగ్యాన్ని గుల్లచేస్తున్న కల్తీకల్లు తయారీ రసాయనాలు, పౌడర్ల విక్రయాలను నిరోధించేందుకు ఆబ్కారీ అధికారులు ఏళ్ల తరబడి పటిష్ఠ చర్యలు తీసుకోవడం లేదు. తమ శాఖ అధికారినే బలితీసుకున్నా అక్రమ వ్యాపారంపై ఆబ్కారీశాఖ ఉక్కుపాదాన్ని మోపడంలేదు. మామూళ్ల వ్యవహరంతోపాటు రాజకీయనేతల అండదండలే కారణమన్న ఆరోపణలున్నాయి. అడపాదడపా ఆబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడుల్లో నకిరేకల్‌ ప్రాంతంలో క్వింటాళ్ల కొద్దీ క్లోరల్‌హైడ్రేట్‌, ఇతర నిషేధిత రసాయనాలు పట్టుబడుతున్నాయి. భారీ స్థాయిలో కల్లు మందు పట్టుబడుతున్నా అక్రమార్కులకు చీమకుట్టినట్లయినా లేకపోవటం చూస్తుంటే ఈ సామ్రాజ్యం ఎంతలా విస్తరించిదో స్పష్టమవుతోంది. నామమాత్రపు కేసులు నమోదవుతుండటం, అసలైన వారి స్థానాల్లో వారి వద్ద పనిచేసేవారిపై కేసులు పెడుతున్నారనే విమర్శలున్నాయి. మహారాష్ట్ర బీవండీ, గుజరాత్‌లోని వాపీ తదితర ప్రాంతాల నుంచి కల్తీకల్లు తయారీకి ఉపయోగించే క్లోరల్‌ హైడ్రేట్‌, డైజోఫాం, సిట్రిక్‌ యాసిడ్‌, ఫోమ్‌యాసిడ్‌, శాక్రీన్‌ను భారీస్థాయిలో దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని ఆగ్రోఇండస్ట్రీలు, తదితర వ్యవసాయ అనుబంధ అవసరాల పేరుతో ట్రాన్స్‌పోర్టులో రవాణా చేస్తున్నారు. తప్పుడు చిరునామాలతో అధికంగా దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని మూసీపట్టి గ్రామాలు, నకిరేకల్‌లో నిల్వ చేస్తున్నారు. సూరత్‌, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, ఏపీలోని భద్రాచలం తదితర ప్రాంతాల్లో కల్లు విక్రయించేందుకు జిల్లా నుంచి అధికశాతం కుటుంబాలు వలస వెళుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు గుట్టుగా సరఫరా చేస్తున్నారు. కల్లు విక్రయాల కోసం వలసలు వెళ్లేవారు క్లోరల్‌హైడ్రేట్‌, డైజోఫాం, సిట్రిక్‌ యాసిడ్‌ తదితర రసాయనాలు విడివిగా తీసుకెళ్లడంలో ఇబ్బందులుంటున్నాయి. వీటిని సమపాళ్లలో కలపడంలో తేడాలొస్తే కల్తీకల్లు తాగినవారు వెంటనే అస్వస్థతకు గురికావడం, మృత్యువాత పడటం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో అక్రమార్కులు అప్రమత్తమయ్యారు. అన్ని మిశ్రమాలను ఒకటిగా చేసి చిన్నచిన్న పొట్లాలుగా వలసదారులకు వికయిస్తున్నారు. రసాయనాల మిశ్రమాల కోసం నకిరేకల్‌లో చిన్నచిన్న మిక్సింగ్‌ యూనిట్లనే ఏర్పాటు చేసుకున్నారు. రెండు దశాబ్దాలుగా నకిరేకల్‌లో కల్లుమందు ఎవరు విక్రయిస్తున్నారు.. ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.. కల్తీకల్లు విక్రేతలకు ఎలా సరఫరా చేస్తున్నారనే విషయాలు బహిరంగ రహస్యమే. జనరల్‌ స్టోర్లతోపాటు ఇతర దుకాణాలు నిర్వహిస్తున్న కొందరు ఈ దందాను కొనసాగిస్తూ రూ.కోట్లలో కూడబెట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. స్థానిక ఆబ్కారీ అధికారులకు ఈ దందా పట్టడం లేదన్న విమర్శలున్నాయి. అడపాదడపా నల్గొండ, హైదరాబాద్‌లోని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి స్థానికుల నుంచి సమాచారం అందడంతో దాడులు చేస్తున్నారు. స్థానిక అధికారులు దాడులు చేసి భారీగా కల్లుమందును స్వాధీనం చేసుకున్న సందర్భాలు చాలా అరుదుగా ఉంటున్నాయి. నాలుగైదు రోజుల వ్యవధిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం నకిరేకల్‌, నార్కట్‌పల్లిలో దాదాపు ఎనిమిది క్వింటాళ్ల క్లోరల్‌హైడ్రేట్‌, డైజోఫాం, ఇతర రసాయనాలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. అధిక శాతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడుల్లో భారీ మొత్తంగా క్లోరల్‌హైడ్రేట్‌, డైజోఫాం, ఇతర రసాయనాలు పట్టుబడుతున్నా.. ఆ తర్వాత రాజకీయ ఒత్తిళ్లతో కేసులు నీరుగారుతున్నాయి. స్వాధీనం చేసుకున్న రసాయనాలను ప్రయోగశాలకు పంపడంలోనే తిరకాసు ఉంటుంది. తీవ్రత తక్కువగా ఉన్న, ఇతర రసాయనాలు, పౌడర్లను పంపుతుండటం వల్లే ప్రయోగశాలల నివేదికలు నిందితులకు అనుకూలంగా రావడం, కేసులు నీరుగారడం వంటివి జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ట్రక్లర్లలో భారీగా కోర్లల్‌హైడ్రేట్‌ పట్టుబడినా ఆ కేసులు నీరుగారాయి. తాజాగా నకిరేకల్‌లో పట్టుబడిన కల్లుమందు కేసును కూడా ఇదే రీతిన నీరుగార్చేందుకు ఓ నేత చక్రం తిప్పుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Related Posts