ఓక రోజు కైలాసం లో పార్వతీదేవి ఈశ్వరునితో మహాదేవా! ధర్మాలు ఎన్నో ఉన్నాయి కదా! అందులో ఉత్తమమైన ధర్మము ఏది? అని అడిగారు...
అప్పుడు పరమేశ్వరుడు.. పర్వతరాజపుత్రీ... పురుషార్ధములు నాలుగు...
ధర్మము,
అర్ధము ,
కామము,
మోక్షము ..
అందులో మొదటి మూడు అయిన ధర్మ, అర్ధ, కామముల వలన కలిగే సుఖములు అశాశ్వతములు. అవి ఎన్నటి కైనా నశిస్తాయి. కాని ఆఖరిది అయిన మోక్షము శాశ్వతమైనది, సుఖప్రథమైనది. అది ఎన్నటికీ నశించదు. కనుక మొదటి మూడు పురుషార్ధముల కంటే మోక్షము అత్యుత్తమమైనది.
మోక్షము ఎలా పొందాలో నీకు చెప్తాను.. మానవుడు
గృహస్తాశ్రమము స్వీకరించిన తరువాత ఋణములు అన్నీ
తీర్చుకుంటాడు. అంటే...
దేవ ఋణము,
పితృఋణము,
ఋషిఋణము,
మనుష్యఋణము..
తీర్చుకుంటాడు. తరువాత వానప్రస్థముకు వెళతాడు. అక్కడ అడవులలో నివసిస్తాడు. ప్రశాంత వాతావరణంలో నిర్మలమైన మనస్సుతో మునుల నుండి సాంఖ్యమును అభ్యసిస్తాడు. సాంఖ్యమనగా 25 తత్వముల జ్ఞానము తెలుసు కొనడమే. తరువాత యోగాభ్యాసము చేస్తాడు. సాంఖ్యము యోగము రెండూ ఒక్కటే. తరువాత సుఖదుఃఖములు, రాగద్వేషములు మొదలగు ద్వందములను జయిస్తాడు. తరువాత శౌచము,
బ్రహ్మచర్యము, శాంతజీవనము, మితాహారము తీసుకోవడము పాటిస్తాడు. మనస్సును అంతర్ముఖంచేస్తాడు. మధ్య మధ్య వచ్చే అవాంతరములను తొలగించుకుంటూ మోక్షమార్గాన పయనిస్తాడు. ఇదీ మోక్షమార్గము. ఇది నిరంతర అభ్యాసము వలన మాత్రమే కలుగుతుంది. ఈ మోక్షమార్గము మానవుడిని జననమరణ చక్రము నుండి విముక్తుడిని చేస్తుంది.
మానవుడు సంసారము నందు విముఖత చెందనంత వరకూ మోక్షమార్గములో పయనించ లేడు. ఈ ప్రాపంచిక విషయముల మీద మనసు విరక్తి కలిగినప్పుడే మానవుడు మోక్షమును పొందగలడు. పార్వతీ ! మనసులో ఉన్న చింతలన్నీ వదిలి పెడితే కాని అందరి అందు సమత్వము, సమభావన కలిగితే కాని తృష్ణ, ఆశ, లోభత్వము విడిచి పెడితే కాని పైన చెప్పిన విరక్తి కలుగదు. వాటి స్వభావము వివరిస్తాను.
ధనము ఉన్నా పోయినా, దగ్గర బంధువులు చనిపోయినా దాని గురించి విచారించడం మానుకోవాలి. పోయిన ధనము గురించి, చనిపోయిన బంధువుల గురించి దుఃఖించడం వలన దుఃఖము పెరుగు తుందేకాని తరగదు. కనుక దుఃఖించడం అనవసరము.
ఎందుకంటే సుఖము, దుఃఖము ఒకదాని వెంట వస్తూ
పోతుంటాయి. స్వర్గలోకాధిపతి దేవేంద్రుడికి కూడా సుఖము
దుఃఖము ఒకటి వెంట ఒకటి వచ్చాయి. ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించే ప్రతి ప్రాణి ప్రతి వస్తువు పరిణామం చెందడం కానీ నాశనం కావడం కాని తధ్యము. ఈ సత్యము తెలిస్తే దుఃఖము కలుగదు. కనుక నాశనం అయ్యే వాటి గురించి చింతించడం అవివేకము. ఇతరుల నుండి ధనమును వస్తువును స్వీకరించే వాడు పట్టు పురుగు తన దారములతో తనను ఎలా బంధించుకుంటుందో అలా తనను తాను బంధించుకుంటాడు.
పార్వతీ ! మానవుడికి ధనము సంపాదించడం, సంపాదించిన ధనం కాపాడడడం, ఆ ధనమును ఖర్చు చెయ్యడం, ఆ ధనముపోతే దాని కొరకు దుఃఖించడం ప్రధాన వ్యాపకాలు. కనుక ధనము అన్ని దుఃఖములకు మూలకారణము. ధనము లేకపోతే దుఃఖము ఉండదు.. అని చెప్పారు...
హర హర మహాదేవ