ఆనందస్వరూపం
ఆనందం అనే మాట వినిపించగానే నవనాడులూ స్పందిస్తాయి. మనసు ఉల్లాసభరితమవుతుంది. ‘ఆనందం’ శబ్దంలో ‘ఆ’ అంటే ‘అన్ని దిక్కుల నుంచి’, ‘నంద’ అంటే ‘సంతోష’మని అర్థం చెబుతారు. ఆధ్యాత్మిక జగత్తులో భగవద్భావనతో మనశ్శరీరాల ఏకత ఆనందప్రాప్తికి బాట వేస్తుంది. ఆనందం అయిదు జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల మాధ్యమంగా మనిషికి అనుభవమవుతుంది.
ఓ ఇంపైన దృశ్యాన్ని చూసినప్పుడు కలిగే ఆనందం నేత్రానందం. సుపరిమళాన్ని నాసిక ద్వారా ఆఘ్రాణించినప్పుడు కలిగే ఉల్లాసం ఘ్రాణానందం. వీనులకు విందైన మధుర సంగీత బాణీలు విన్నప్పుడు కలిగే ఆనందం శ్రవణానందం. మనసును మైమరపించే ఆనందం స్పర్శవల్ల కలిగితే అది త్వగానందం. రుచికరమైన ఆహారపదార్థాలు, పానీయాలు సేవించినప్పుడు కలిగే మధురభావన జిహ్వానందం. ఈ ఆనందాలన్నీ చేరువైనప్పుడు అనుభూతించేది పరమానందం!
ఆనంద జీవనం దేవతలకే సాధ్యమా, సామాన్య మానవులు కష్టాలు అనుభవించాల్సిందేనా, ఆనందం కొందరికి అందని ద్రాక్షేనా వంటి ప్రశ్నలు సహజంగా ఉత్పన్నమవుతాయి. ఆనందంగా జీవించడం ఏ కొందరి జన్మహక్కో, అదృష్టమో అని భావించనక్కరలేదు. ఈ ప్రపంచంలో ఏదీ ఊరకనే లభించదు. దానికోసం అన్వేషణ చేయాలి. అవసరమైన సందర్భాల్లో మూల్యం చెల్లించాలి. మూల్యం దుఃఖానుభవ రూపంలోనూ కావచ్చు. కొందరు తమ జీవిత కాలంలో సాధించలేని కార్యాలు వారి మరణానంతరం సాకారమవుతాయి. అటువంటి సందర్భంలో ‘చచ్చి సాధించా’రంటారు. సాధన వల్ల భౌతిక విజయాలు సిద్ధిస్తాయి. దైవాన్ని పొందడంకోసం సాగించేది ఆధ్యాత్మిక సాధన! ఆనందాన్ని సైతం మనిషి ప్రయత్నంలో సాధన చేసి పొందాల్సి ఉంటుంది.
పసిబిడ్డలు, కల్లాకపటం ఎరుగనివారు ఆనందంగా ఉంటారు. పిచ్చివారు సైతం తమదైన శైలిలో ఆనందాన్ని పొందుతారు. ఎవరిలోనైనా విశేష గుణాలను సాధనచేస్తే ఎవరికైనా ఆనందసిద్ధి కలగవచ్చు. స్థితప్రజ్ఞులకు ఆనందం తమ వెంటే ఉంటుంది. కోరికలు తీరినవారికంటే త్యజించినవారికి ఆనందం సులభంగా అందివస్తుంది.
‘చదువులలో సారమెల్ల చదివితి తండ్రీ’ అని తండ్రి హిరణ్యకశిపుడుతో చెప్పిన ప్రహ్లాదుడు అన్ని విపత్కర పరిస్థితుల్లోనూ దుఃఖం అనుభవించలేదు. పాములతో కరిపించినా, విషం తాగించినా, సముద్రాల్లో పడవేసినా, పర్వతాలపై నుంచి కిందికి తోసినా, కత్తులతో నరికినా అతడు చలించలేదు. చావలేదు. తాను కష్టాల్లో ఉన్నాననీ అతడు భావించలేదు. అతడి పెదవులపై చిరునవ్వు చెక్కు చెదరలేదు. అచంచల విష్ణుభక్తి వల్ల ప్రహ్లాదుడు నిరంతరం బ్రహ్మానందాన్ని అనుభవించాడు.
ఆనందాన్ని ప్రస్తావిస్తూ వేదాలు ‘ఆనందో బ్రహ్మ’ అన్నాయి. శాస్త్రవేత్తలు ఆనందాన్వేషణకు కొన్ని మార్గాలు చెప్పారు. మానవసంబంధాలు ఆనందప్రాప్తికి దోహదపడతాయన్నది వారి సందేశం! తమకు ఇష్టులు, తమను ప్రేమించేవారితో పెంపొందే బంధాలు,అనుబంధాలువ్యక్తుల్లో ఆనందస్థాయిని నిర్దేశిస్తాయి. అవసరాలకు, సుఖజీవనానికి తగినంత ధనం అవసరం. మనం భౌతిక ప్రపంచంలో జీవిస్తాం! ఆనంద రసాస్వాదనకు భౌతిక అంశాలు సాయపడతాయి. అందమైన ప్రకృతి, చూసేవారికి సంతోషం కలిగిస్తుంది. చల్లని హాయిగొలిపే పరిసరాలు కవులు, రచయితల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయి.
కొందరు సదా ఊహల్లో విహరిస్తుంటారు. వారిలో ఊహావిహారం ఉల్లాస ఉత్సాహాలకు ప్రోదిచేస్తుంది. వర్తమానంలో జీవిస్తూ అందులోని మాధుర్యాన్ని ఆస్వాదించాలి. కొన్ని సందర్భాల్లో పెను కష్టం తరవాత ఆనందం వెల్లివిరియవచ్చు. క్షీరసాగర మథనంలో అమృతం ఆవిర్భవించడం అటువంటిదే. కనిపించే ప్రతికూలతలోనూ ఒక అనుకూలాంశం నిగూఢంగా దాగిఉంటుంది. దుర్భర పరిస్థితుల్లోనూ కొందరు ఆనంద జీవనం చేస్తారు. వారే స్థితప్రజ్ఞులు. పరిస్థితులు ఎలాంటివైనా నిబ్బరంగా జీవించే ప్రతి మనిషీ ఆనంద స్వరూపుడే!