YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అడవికి దిక్కెవరు..? (పశ్చిమగోదావరి)

అడవికి దిక్కెవరు..? (పశ్చిమగోదావరి)

అడవికి దిక్కెవరు..? (పశ్చిమగోదావరి)
ఏలూరు, ఫిబ్రవరి 10  జిల్లాలో అడవులకు రక్షణ లేకుండా పోతోంది. జిల్లాలోనే అత్యధికంగా 36,000 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న కుక్కునూరు రేంజికి ఏడాది కాలంగా క్షేత్రాధికారి లేరు. పక్కనున్న అమరవరం (కుక్కునూరు మండలం) అటవీక్షేత్రాధికారికే అదనపు బాధ్యతలు అప్పగించి కాలం వెళ్లదీస్తున్నారు. ఈ రెండు రేంజిలు కలిపితే అటవీ విస్తీర్ణం దాదాపు 47,000 హెక్టార్లలో ఉంటుంది. ఇంత భారీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవిని ఒక్క అధికారి పర్యవేక్షించటం అంటే సాధారణ విషయం కాదు. ఈ విషయం ఆ శాఖకు తెలియంది కాదు.  8 ఏళ్లుగా అటవీశాఖలో రిక్రూట్‌మెంట్లు లేవు. దీంతో  భారీ స్థాయిలో ఖాళీలు ఏర్పడ్డాయి. జిల్లాలో ఆరు అటవీ రేంజిలు ఉన్నాయి. ఇందులో దాదాపు 30 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. రేంజి అధికారులు, డిప్యూటీ రేంజి అధికారులు, సెక్షన్‌ అధికారులు, బీటు అధికారులు, సహాయ బీటు అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 264.40 చ.కి.మీ.లలో విస్తరించి ఉన్న జిల్లా అడవుల్లో ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంచటమంటే, అడవిని గాలికి వదిలేసినట్లే లెక్క. టేకు, జిట్రేగి, బండారు, వేగిశ, తెల్లమద్ది వంటి విలువైన వృక్షజాతులు ఉన్న అడవులకు సరైన రక్షణ లేకుంటే, అటవీ సంపద మొత్తం అక్రమార్కుల పాలవుతుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఎప్పుడో 1960 ప్రాంతంలో వేసిన టేకు ప్లాంటేషన్‌లలో చెట్లు టింబరు సైజుకు చేరడంతో స్మగ్లర్లు వాటిపై కన్నేశారు. దీంతో విలువైన టేకు ప్లాంటేషన్లు కరిగిపోతున్నాయి. అటవీ శాఖకు కొన్నివేల హెక్టార్లల్లో జామాయిల్‌ తోటలు ఉన్నాయి. పోడు పేరిట ఆదివాసీలు నరికిన అటవీ ప్రాంతాలను శుభ్రం చేసి, ఆ శాఖ పెద్దఎత్తున జామాయిల్‌ తోటలను పెంచింది. రూ.కోట్లు విలువ చేసే ఈ తోటలకు కూడా రక్షణ కరవైంది. సిబ్బంది కొరత ఉండటంతో అనేక బీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది అక్రమార్కులకు ఆయాచిత వరంగా మారింది. కొన్నిచోట్ల సిబ్బంది ఉన్నా అక్రమార్కులతో చేతులు కలిపి తోటలను నరికివేయటంలో సహకరిస్తున్నారు. ఇటువంటి అక్రమ వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలంటే, ముందుగా పోస్టులను భర్తీచేయాలి. దాంతో పాటు ఎక్కడ పనిచేసే అధికారి అక్కడే నివాసం ఉండేలా ఏర్పాట్లు చేయాలి.  అటవీశాఖ సంపద రక్షణ కోసం నిఘా ఏర్పాట్లు చేస్తోంది. బీటు అధికారులతో పాటు, స్ట్రైకింగ్‌ ఫోర్సులు, బేస్‌ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాట్లు కొంత మేర అక్రమ రవాణాను అడ్డుకుంటున్నా, పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవటం కూడా పెద్ద సమస్యగా మారింది. జిల్లాలోని అతిపెద్ద రేంజి అయిన కుక్కునూరునే ఆ శాఖ ఖాళీగా ఉంచిందంటే, ఆ శాఖలో పోస్టుల పరిస్థితి ఏ విధంగా ఉందో వేరేగా చెప్పనవసరం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 1,945 పోస్టులు భర్తీచేయాల్సిన అవసరాన్ని రాష్ట్ర అటవీదళాల అధిపతి ప్రదీప్‌కుమార్‌ ఇటీవల ప్రభుత్వానికి నివేదించారు. గత 8 ఏళ్లుగా రిక్రూట్‌మెంటు లేకపోవటంతో, 51 శాతం మేర పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. తక్షణమే ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు ఆ శాఖలో కదలిక మొదలైంది. ఏయే రేంజిలలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న సమాచారాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులు కోరుతున్నారు.

Related Posts