కేంద్రీయ విద్యాలయంలో సమస్యలు
విజయవాడ, ఫిబ్రవరి 10,
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడుతున్న ప్రముఖ విద్యాసంస్థ కేంద్రీయ విద్యాలయంలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఆరు నెలలుగా జంట్స్ టాయిలెట్ అవుట్‌లెట్ డ్రైన్ మూసుకుపోయింది. దానిలో నుంచి మురుగునీరు బయటకు వెళ్లకుండా నిలిచిపోయింది. తీవ్ర దుర్గంధం వెలువడుతుంది. దీంతో స్టాఫ్ రూమ్‌లో సిబ్బంది ఉండలేక అల్లాడిపోతున్నారు. ఇక విద్యార్థుల టాయిలెట్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మకిలిపట్టి చూడటానికి అసహ్యంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కొత్త భవనం నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన పనుల కారణంగా టాయిలెట్స్ అవుట్‌లెట్ పైపులైన్ ధ్వంసం అయింది. దాన్ని బాగు చేయమని ఎన్ని సార్లు అడిగినా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నగర పాలక సంస్థ అధికారులకు తెలియపర్చినా పట్టించుకున్న నాధుడు కరువయ్యాడు. దీంతో విద్యార్థులు టాయిలెట్స్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. టాయిలెట్స్ నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం లేక ఎదురుతంతున్నాయి. అని భోజనం సమయంలో విద్యార్థులు చేతులు కడుక్కుని మంచినీరు తాగేప్రాంతంలో నిలిచిపోయాయి. దీంతో భోజనం సహించక విద్యార్థులు యాతన పడుతున్నారు. మురుగునీరు గ్రౌండ్‌లో నిలిచిపోవటంతో దోమల దాడి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు అనారోగ్యం పాలవుతారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎప్పుడో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు గరగరమంటూ చాలా నిదానంగా తిరుగుతున్నాయి. ఉక్కపోత పెరగటంతో విద్యార్థులు ఉండలేక చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.కొత్త భవనం నిర్మాణం సందర్భంగా వచ్చిన బంక మట్టిని గ్రౌండ్ అభివృద్ధి అంటూ చక్కని ఆటస్థలంలో వేశారు. నల్లమట్టి, రాళ్లు ఉండటంతో అటువైపు చూసే పరిస్థితి లేదు. అసలే కేవీలో క్రీడలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం ఉంటే దీనికి తోడు ఉన్న ఆటస్థలం అనుకూలంగా లేకుండా పోయింది.