షీలాదీక్షిత్ రాసిన ఆత్మకథ ఈనెల 27న జైపూర్‌లో విడుదల
షీలాదీక్షిత్...కాంగ్రెస్ పార్టీలో దీక్షాదక్షతలు, క్రమశిక్షణ కలిగిన సీనియర్ నేత. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిగా, సోనియాగాంధీకి అత్యంత నమ్మకస్థురాలుగా పేరుతెచ్చుకున్నారు. నిజానికి గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోతానని ఆమె ఊహించ లేదట. తాను చేసిన అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన గురించి కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువ ఓటర్లకు తెలియకపోవడం వల్లే కాంగ్రెస్ ఓటమి పాలైందట.ఇలాంటి సంచలన విషయాలను షీలాదీక్షిత్ తన 'ఆత్మకథ'లో రాసుకున్నారు. 'సిటిజన్ ఢిల్లీ: మై టైమ్స్, మై లైఫ్' పేరుతో షీలాదీక్షిత్ రాసిన ఆత్మకథ ఈనెల 27న జైపూర్‌లో జరుగనున్న సాహితీఉత్సవంలో విడుదల కానుంది.
ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమికి పలు కారణాలను తన 'ఆత్మకథ'లో షీలాదీక్షిత్ విశ్లేషించారు. '2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. నా హయాంలో ఢిల్లీలో ఎన్నో కీలక మార్పులు తీసుకువచ్చాను. అయితే ఓటర్లలో తొలిసారి ఓటు హక్కు వచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు. వారు 15 ఏళ్ల క్రితం ఢిల్లీ ఎలా ఉందో తెలియదు. ఢిల్లీలో నిరంతర విద్యుత్, ఫ్లైఓవర్లు, మెట్రోరైలు, కొత్త యూనివర్శిటీలు ఇలా చాలా తెచ్చాం. ఇవేవీ వారికి తెలియదు. కాంగ్రెస్ ఓటమికి ఇదో కారణం. అయినా ఢిల్లీని ఇంతగా అభివృద్ధి చేసిన సంతృప్తి మాత్రం నాకు ఉంది. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రావడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అంతగా సీరియస్‌గా తీసుకోలేదు. ప్రజల మనోభావాలను ఆయన ఓట్లగా మార్చుకుంటారని అనుకోలేదు' అని షీలాదీక్షిత్ అంగీకరించారు. ఆప్‌ను తక్కువగా అంచనా వేయడం వల్ల తాను సైతం ప్రతిష్ఠాత్మక న్యూఢిల్లీ సీటును 25 వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయానని అన్నారు. 2010 కామన్‌వెల్త్ క్రీడల్లో అవినీతి ఆరోపణలను కూడా ఆమె తోసిపుచ్చారు. అనేక అరోపణలపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని షుంగ్లూ కమిటీ పక్కనపట్టేసిందని అన్నారు. తన పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయాలని అనుకున్నప్పటికీ డిసెంబర్ 16న వెలుగుచూసిన గ్యాంగ్ రేప్ ఘటనతో తాను పదవిలోనే కొనసాగాలనే దృఢ నిశ్చయానికి వచ్చానని చెప్పారు. ఆ తర్వాతే తన నిర్ణయాన్ని అధిష్ఠానానికి చెప్పానన్నారు. 2014 మార్చి-ఆగస్టు మధ్య కేరళ గవర్నర్‌గా ఉన్న కాలంలోనే ఆత్మకథను రాయాలనే నిర్ణయం తీసుకున్నట్టు షీలాదీక్షిత్ తెలిపారు.