సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీ లో మహిళా విద్యాలయంలో కీచకపర్వం
. ఈ నెల 6న గార్గి కాలేజీ కల్చరల్ ఫెస్టివల్ సందర్భంగా కొందరు వ్యక్తులు క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్ధులపై వికృత చేష్టలకు దిగడం కలకలం రేపింది. ఢిల్లీ పోలీస్ సిబ్బంది అక్కడే ఉన్నా చూసీ చూడనట్టు వదిలేశారని విద్యార్థినులు ఆరోపించారు. బాధిత విద్యార్ధినులు సోషల్ మీడియాలో తమ గోడు వెల్లడించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అధికారులు తమకు భద్రత కల్పించలేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది మంది విద్యార్ధునులు కాలేజీ గేటు ముందు ధర్నా చేపట్టారు. కాగా సీసీటీవీ ఫూటేజీల ఆధారంగా ఈ ఘటనపై ఇప్పటికే విచారణ చేపట్టినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే విద్యార్ధినుల నుంచి ఇంతవరకు తమకు ఇప్పటి వరకు ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. కాగా ఘటన జరిగినప్పుడు ర్యాపిడ్ యక్షన్ ఫోర్స్ ప్రేక్షకపాత్రలో అక్కడేవుంది . ‘‘గేట్లు దూకి కొంతమంది, చొరబడి కొందరు, గోడలు దూకి మరికొందరు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. వాళ్లంతా మద్యం సేవించి విచక్షణ లేకుండా ప్రవర్తించారు. అసభ్యంగా తాకుతూ వికృత చేష్టలకు దిగారు. అమ్మాయిలు భయపడి బాత్రూంల వైపు పరుగెట్టినప్పటికీ.. అక్కడికి కూడా వచ్చి బయట నుంచి గడియలు పెట్టారు...’’ అంటూ ఆ రోజు జరిగిన దారుణాన్ని ఓ పొలిటికల్ సైన్స్ విద్యార్ధిని కళ్లకు కట్టినట్టు వెల్లడించింది. తమను వేధించడమే కాకుండా ఎవరికైనా చెబితే అంతుచూస్తామంటూ బెదిరించారనీ.. ఇంకొందరు బూతులు తిడుతూ వెళ్లారని విద్యార్ధినులు ఆరోపించారు. ఆటో డ్రైవర్లు కూడా తమ వాహనాలను కాలేజి బయట వదిలి క్యాంపస్‌లోకి చొరబడ్డారని విద్యార్థినులు పేర్కొన్నారు.