YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

రొయ్యపై కరోనా పంజా (కృష్ణా జిల్లా)

రొయ్యపై కరోనా పంజా (కృష్ణా జిల్లా)

రొయ్యపై కరోనా పంజా (కృష్ణా జిల్లా)
మచిలీపట్నం, ఫిబ్రవరి 10: 1ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ ఆక్వా రైతులను కలవరపెడుతోంది. వనామీ రొయ్యల ఎగుమతులపై సునామీలా విరుచుకుపడుతోంది. ఈ వ్యాధి వార్తల్లో నిలిచినప్పటి నుంచి క్రమంగా ఆక్వా రంగంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. డిసెంబరు సాగుపై గంపెడు ఆశలు పెట్టుకున్న సాగుదారులకు కన్నీళ్లు మిగిల్చేదిశగా పరిస్థితులు కనిపిస్తు న్నాయి. ధరల పతనానికి ఎలాంటి అవకాశం వచ్చినా సొమ్ము చేసుకునే దళారులు దీన్ని బూచి చూపుతూ.. మరింత ప్రతిష్టంభన సృష్టిస్తారేమోనని సాగుదార్లు ఆందోళనకు గురవుతున్నారు. మధ్యవర్తుల మతలబు.. రాష్ట్ర తలసరి ఆదాయంలో మేటిగా నిలుస్తున్నప్పటికీ ఆక్వా రంగానికి ఆటుపోట్లు తప్పడం లేదు. దేశీయ అవసరాలకు తగిన డొమెస్టిక్‌ మార్కెట్‌ లేకపోవడం, అధిక ఉత్ఫత్తుల కారణంగా విదేశాలకు ఎగుమతి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగానే జిల్లాలో ఉత్పత్తి అయిన రొయ్యలను జపాన్‌, ఐరోపా, లాటిన్‌ అమెరికా దేశాలకు ఎక్కువగా ఎగుమతులు చేస్తుంటారు. రైతులు నేరుగా పంపించే అవకాశం లేకపోవడంతో కొందరు మధ్యవర్తులు వారిని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎగుమతులన్నీ చైనా వెళ్లి అక్కడి నుంచి ఇతర దేశాలకు తరలిస్తారంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అదనుగా ధరలను క్రమంగా తగ్గించేస్తున్నారు. మార్కెట్‌ను అస్థిరపరుస్తూ..అయోమయానికి గురి చేస్తున్నారు. కరోనా వైరస్‌ బయటపడినప్పటి నుంచి క్రమంగా ధరలు పతనం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ వైరస్‌ కారణంగా మాంస విక్రయాలు గణనీయంగా పడిపోయాయని, పైగా ఎగుమతులు లేవంటూ ప్రచారం కల్పించడంతో కొందరు రైతులు అయినకాడికి అమ్ముకునే పరిస్థితికి వస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల్లో ఎలాంటి మార్పులు లేనప్పటికీ స్థానికంగా దిగజారుస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలోకు రూ.20 నుంచి రూ.40 వరకు ఆయా కౌంటును బట్టి ధరలు తగ్గుముఖం పట్టాయి. మధ్యవర్తులు ఒకే మాటపై ఉండడం వల్ల రైతులు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఏటా డిసెంబరు సాగు ద్వారా అధిక లాభాలు వస్తాయని రైతులు ఆశిస్తుంటారు. దానికి తగ్గట్టుగానే ఇటీవల సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. గతంలో చేసిన అప్పులు కొంతమేరకైనా తీర్చుకునే అవకాశం దక్కుతుందని భావించారు. ఈ నేపథ్యంలో కరోనా పరోక్షంగా తమపై ఇటువంటి ప్రభావాన్ని చూపించడంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలోని వెళ్లిపోయారు. ధరలు బాగుంటే దిగుబడులు తగ్గడం, దిగుబడులు ఎక్కువగా ఉంటే ధరలు పడిపోవడం అనేది అలవాటుగా మారినా.. ఇలాంటి అనుకోని పరిస్థితులు కూడా దాడి చేస్తే ఇంకెప్పుడు కోలుకుంటామంటూ వాపోతున్నారు.

Related Posts