నరకయాతనే.. (నల్గొండ)
నల్గొండ, ఫిబ్రవరి 10 : జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో మందులు, శస్త్ర చికిత్సలో వాడే పరికరాలకు సుస్తీ చేసింది. ఫలితంగా నెల రోజులుగా రోగులు నరకయాతన పడుతున్నారు. దూది నుంచి శస్త్రచికిత్సలకు ఉపయోగించే కొన్ని రకాల ఇంప్లాంట్స్ వరకు కొరత కారణంగా రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ కొరత ఆస్పత్రిలోని కొందరు సిబ్బంది, వైద్యులకు వరంగా మారింది. రోగులను సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రులకు పంపుతూ వారిచ్చే కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనరల్ ఆసుపత్రిలో ప్రస్తుతం పాముకాటుతో పాటు చిన్నపాటి గాయాలకు వేసే టీటీ ఇంజక్షన్లు సైతం అందుబాటులో లేవు. అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకు సరఫరా చేసే కెవిన్, ఆర్‌ఎల్ సెలైన్ బాటిళ్లు, గుండెజబ్బు బాధితులకు ఇచ్చే సెఫ్రాకైవేజీ, బీపీ జబ్బు ఉన్నవారికి ఇచ్చే అమ్లోడోఫిన్, ప్రసూతి వార్డులో ఉపయోగించే గ్లైకోపైరోలెట్, మూత్రపిండ వ్యాధిగ్రస్తుల్లో రక్తశుద్ధికి ఉపయోగించే ఎఫారిన్ సోడియం, ఐరన్ సుక్రోజ్, ప్రసవాల కోసం మహిళలకు ఇచ్చే ఇంజక్షన్, ఆక్సిటోసిస్ వంటి 656 రకాల మాత్రలు ఉండాల్సినప్పటికీ ప్రస్తుతం 220 రకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వైద్యులు చేతులకు వేసుకునే గ్లౌజులు, సిరంజులు, ఐవీక్యాన్లు, బీటీ సెట్స్‌తో, ఎముకల్లో వేసే ఇంప్లాంట్స్‌తో పాటు చివరకు ఆపరేషన్ పూర్తి అయిన తరువాత కుట్లు వేసే 20 నెంబర్ సూదులు సైతం నిల్వ లేవు. జనరల్ ఆసుపత్రికి ఈ ఏడాది రూ.1.14 కోట్ల విలువ చేసే మందులు వచ్చాయి. వాటితోనే నెట్టుకొస్తున్నారు. జనరల్ ఆసుపత్రిలో అత్యవసర మందుల పేరుతో కొన్ని రకాల మందులు, పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా జిల్లా కేంద్రంలోని ప్రకాశంబజార్‌లో ఉన్న ఓ మందుల దుకాణదారు అత్యవసర మందులు సరఫరా చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రి నుంచి జనరల్ ఆసుపత్రిగా మారినా మందులు సరఫరా చేసే కాంట్రాక్టర్ మాత్రం మారక పోవడంతో ఉన్నత స్థాయి అధికారులకు పెద్ద మొత్తంలో కమీషన్లు ముడుతున్నట్లు సమాచారం. జనరల్ ఆసుపత్రిలో పిల్లల వార్డు, జనరల్ సర్జన్, ఎముకల శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ పథకం కింద కొద్ది రోజుల క్రితం వరకు పెద్ద మొత్తంలో శస్త్రచికిత్సలు జరిగేవి. కొంత మంది వైద్యులు చేసే శస్త్రచికిత్సలతో ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే నగదు ప్రోత్సాహకం ఇతర అధికారులు, సిబ్బందికి పంపకాలు చేయాల్సి రావడంతో వారు శస్త్రచికిత్సలు చేయడం మానేసినట్లు తెలిసింది. దీంతో గడిచిన రెండు నెలల్లో ఎముకల వార్డులో 32 మందికి ఆరోగ్యశ్రీ నుంచి అనుమతి వస్తే 14 మందికి మాత్రమే శస్త్రచికిత్స చేశారు. మిగతావారిని ఇంప్లాట్స్ లేని కారణంగా మంచాలకే పరిమితం చేశారు. కొందరు ప్రైవేటును ఆశ్రయించగా, ఆరుగురు వార్డులో శస్త్రచికిత్స కోసం నెలల తరబడి వేచి చూస్తున్నారు. బాధితులకు సీటీ స్కాన్, ఏబీజీ మిషన్, ఇంప్లాంట్స్ అందుబాటులో లేవు. పైగా అత్యవసర పరిస్థితుల్లో ఆయా పరీక్షల కోసం ప్రయివేట్ ఆసుపత్రులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇటీవల రద్దు చేశారు. ఫలితంగా ఆయా పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడం, ప్రయివేట్ ఆస్పత్రులతో ఒప్పందం ముగిసిపోవడంతో రోగులే ఛార్జీలు భరించాల్సి వస్తోంది. ఇలాంటి కారణాలతోనూ కొన్ని శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి.