పేరుకే దిశా... లోపల ఏం లేదు దశ
రాజమండ్రి, ఫిబ్రవరి 11,
దిశ పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరం పోలీసులకు తలనొప్పిగా మారింది. పార్లమెంటులో దిశ చట్టం ఆమోదం పొందకుండానే పీఎస్ ప్రారంభించడంతో... బాధితులు, రాజకీయ వర్గాల నుంచి ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారు.ఏపీ సీఎం జగన్ చేతుల మీదుగా దిశ పోలీసు స్టేషన్ ప్రారంభం అయిన 24 గంటలు తిరగకముందే రాజమహేంద్రవరంలో బాధితులు క్యూ కట్టారు. అయితే పార్లమెంటులో దిశ చట్టం ఆమోదం పొందకపోవడంతో బాధితులకు ఏం సమాధానం చెప్పాలో అక్కడి సిబ్బందికి పాలుపోవడం లేదు. గతంలో మహిళా పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులే... దిశ పీఎస్‌కు రావడంతో... వాటిని నమోదు, చేయాలా వద్దా అని తలలు పట్టుకుంటున్నారురాజమండ్రి దిశ పీఎస్‌లో ఇన్నీసుపేటకు చెందిన మౌనికాదేవి మొట్టమొదటి ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం తన భర్త, అత్తమామలు ఏడేళ్లుగా వేధిస్తున్నారని... వారిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరింది. నెహ్రూ నగర్‌కు చెందిన జ్యోతిర్మయి రెండో ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం నాలుగేళ్లుగా తన అత్తమామలు వేధిస్తున్నారని పోలీసుల్ని ఆశ్రయించింది. వీటిపై విచారణ చేపట్టిన మహిళా అధికారులు... ఇవి సాధారణ గృహిణుల కేసులు కావడంతో వారికి సర్ది చెప్పి వెనక్కి పంపించారు.దిశ పీఎస్‌లో మూడో కేసును రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పెట్టారు. గత అసెంబ్లీ సమావేశాల్లో తాను మద్యం పాలసీపై మాట్లాడిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఆరోపించారు. నిందితులపై దిశ చట్టం కింద కేసులు నమోదు చేయాలని పోలీసుల్ని కోరాఉ. టీడీపీ మహిళా నేతలు, పెద్దఎత్తున కార్యకర్తలతో కలిసి వెళ్లి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఫిర్యాదు చేశారు. పార్లమెంటులో ఆమోదం పొందకుండా దిశ చట్టం ప్రకారం కేసు నమోదు చేయలేక... అలాగని సాధారణ కేసుగా పరిగణించలేక తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోందిఎమ్మెల్యే భవాని రాజకీయ దురుద్దేశంతో ఫిర్యాదు చేశారని అడిషనల్ ఎస్పీ లతా మాధురి అన్నారు. ఈ వ్యవహారంపై ఆమె గతంలో అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని... సభాపతి పరిధిలో ఉండటంతో తామేం చేయలేకపోతున్నామని ప్రకటించారు. దిశ అనేది ఒక స్ఫూర్తి మాత్రమేనని... ఈ పోలీసు స్టేషన్ కూడా సాధారణ మహిళా పీఎస్ లాంటిదే అని కొత్త పల్లవి అందుకుంటున్నారు.మరోవైపు దిశ చట్టం పేరుతో సీఎం జగన్ మహిళల్ని మభ్య పెడుతున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే భవానితో ఫిర్యాదు చేయించినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు ఇరుకున పడినట్లైంది. దిశ చట్టం కింద కేసులు నమోదు చేయలేక... సాధారణ మహిళా పోలీసు స్టేషన్‌గా పరిగణించలేక ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది.