ఏపీలో ఆటో మ్యుటేషన్ సేవలు ప్రారంభం
అమరావతి జనవరి11
ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్ సేవలు అమలు అవుతాయి. ఈ మేరకు మంగళవారం నాడు సచివాలయంలో ఆటో మ్యుటేషన్ సేవల పోస్టర్ను ముఖ్యమంత్రి వైయస్.జగన్ విడుదలచేసారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూశాఖ మంత్రి సుభాష్ చంద్రబోస్, అధికారులు హజరయ్యారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో రైతులకు చెందిన క్రయ, విక్రయ భూమి వివరములు రిజిస్ట్రేషను చేయబడినప్పటి రెవెన్యూ రికార్డులలో మార్పులు కొరకు తహసీల్దారు కార్యాలయం, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగవలసి వచ్చేది. దాంతో రైతులకు ఆసౌకర్యం కలగడమే కాక, రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఏర్పడే అవకాశాలు వుండేవి. ఈ నేపధ్యంలో రిజిస్ట్రేషను చేయబడిన భూముల వివరాలు రెవెన్యూ రికార్డులలో సత్వరం మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆటో మ్యుటేషన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డుల ఆన్లైన్ భూమి బదలాయింపు కొరకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేకుండా భూ రికార్డుల మార్పిడి నమూనా (ఆర్ ఓ ఆర్ –1బి, అడంగల్) వివరములు ఆన్ లైన్ ద్వారా రెవెన్యూశాఖకు పంపుతారు. ఈ భూ మార్పిడి వివరాలను మీభూమి పబ్లిక్ పోర్టల్ లో సరిచూసుకునే సదుపాయం కూడా కల్పించారు. ఆటో మ్యుటేషన్ ఫైలట్ ప్రాజెక్టు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో 2019లో ప్రారంభం అయింది.