YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 నిధులు లేక నీరసంగా డబుల్ ఇళ్లు

 నిధులు లేక నీరసంగా డబుల్ ఇళ్లు

 నిధులు లేక నీరసంగా డబుల్ ఇళ్లు
హైద్రాబాద్, ఫిబ్రవరి 12,
టర్‌ హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ ఇండ్ల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పటి వరకు పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. దాదాపు రూ.900కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో సదరు కాంట్రాక్టర్లు ఐదు నెలలుగా పనులు బంద్‌ చేశారు. జీహెచ్‌ఎంసీలో రూ.90కోట్లు లేక దాదాపు 40 వేలకుపైగా ఇండ్లు తుది దశలో ఆగాయి. లబ్దిదారుల జాబితా ఎంపిక కానందున అటు కేంద్రం వాటా కూడా రాలేదు. నిధులు లేక ఇండ్ల నిర్మాణం ఆగడంతో.. బస్తీలను ఖాళీ చేసిన పేదలు ఇంటి అద్దెలు భరించలేక అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పేదల ఒత్తిడితో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలని పాలకమండలికి విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ విషయంపై ఈనెల 8న కౌన్సిల్‌ సమావేశంలో కార్పొరేటర్లు లేవనెత్తారు.గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 114 ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం చేపడుతోంది. మొత్తం రూ.8,598 కోట్లతో 97,953 డబుల్‌ ఇండ్ల పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేసి నాలుగేండ్లు గడిచినా ఇప్పటి వరకు 8,620 ఇండ్లను మాత్రమే పూర్తి స్థాయిలో నిర్మించింది. అందులో 108 ఇండ్లను మాత్రమే ప్రారంభించారు. మరో 8,512 ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. నిర్మాణ పనులను పూర్తి చేసుకుని దాదాపు 46,279 ఇండ్లు ఫినిషింగ్‌ దశలో ఉన్నాయి. అయితే, ఆ ఇండ్లకు ఫినిషింగ్‌ పనులు చేయడానికే రూ.90 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా. ఈ మొత్తం లేకపోవడంతో అవి కాస్తా నిలిచిపోయాయి.గ్రేటర్‌లో 114 ప్రాంతాలకుగాను 47 ప్రాంతాల్లో ఇన్‌సిటూ కింద 9,454 ఇండ్లు, 67 ఖాళీ స్థలాల్లో 88,491 ఇండ్లను నిర్మిస్తున్నారు. వీటికోసం రూ.8598 కోట్లు అవసరమని ప్రభుత్వ అంచనా. అందులో ఇప్పటి వరకు రూ.5,136కోట్లు ఖర్చు చేశారు. కానీ, 8,620 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 89,333 ఇండ్లు ఆయా దశల్లో ఉన్నాయి. అయితే, ఈ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి చేసిన పనులకే ఆయా కాంట్రాక్టర్లకు దాదాపు రూ.900 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కో ఇంటికి రావాల్సిన రూ.లక్షన్నర వాటా ప్రకారం మొత్తం రూ.1500 కోట్లు అందాల్సి ఉంది. కానీ, లబ్దిదారుల జాబితాను ఎంపికతోపాటు ఆన్‌లైన్‌ చేయకపోవడం కారణంగా.. ఆ నిధులను కేంద్రం నిలిపేసింది. దీంతో డబుల్‌ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సకాలంలో నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి.బల్దియా ఖజానాలో నిధుల్లేక డబుల్‌ ఇండ్లు నిలిచిపోయాయి. డబుల్‌ ఇండ్లు పూర్తవ్వకపోవడంతో స్థానిక బస్తీ ప్రజలు కార్పొరేటర్లపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. డబుల్‌ ఇండ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయాలంటూ బల్దియా కార్యాలయంలో ఇంజినీరింగ్‌ అధికారులు, కమిషనర్‌, మేయర్‌ చుట్టూ కార్పొరేటర్లు తిరుగుతున్నారు. బస్తీలను ఖాళీ చేసిన ప్రదేశాల్లోనైనా బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు. బాగ్‌లింగంపల్లి లంబాడ తండాలో 234 ఇండ్లకు రూ.5 కోట్లు పెండింగ్‌ బిల్లులు ఉన్నాయని, ఇక్కడి బస్తీ ప్రజలు ఖాళీ చేయడంతో ప్రతినెలా వారికి అద్దెలు భారంగా మారుతున్నాయంటున్నారు.

Related Posts