YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 సగం మందికి అందని రైతు బంధు

 సగం మందికి అందని రైతు బంధు

 సగం మందికి అందని రైతు బంధు
నిజామాబాద్, ఫిబ్రవరి 12, 
రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు సాయం అందడం లేదు. వారి పేరున భూమి ఉన్నా, సాగు చేస్తున్నా కూడా పెట్టుబడి సాయం రావడం లేదు. పాస్బుక్కుల్లోని వివరాల్లో తప్పులున్నవారు, కొత్తగా భూమిని కొన్నవారు కలిపి సుమారు 12 లక్షల మందికి ఈ యాసంగిలో రైతు బంధు సొమ్ము రాలేదు. కేవలం గత ఏడాది యాసంగిలో రైతు బంధు అందినవారికే సర్కారు ఈసారి కూడా ఇస్తోంది. మిగతావారికి మొండిచెయ్యి చూపింది. ఖర్చు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతోనే ఇట్లాంటి తిరకాసు పెడుతోందని రైతులు మండిపడుతున్నారు.ఈ ఏడాది యాసంగి ప్రారంభం నాటికి 59 లక్షల రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదైయ్యాయి. కొన్నేళ్లుగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన వారంతా మ్యూటేషన్‌ చేయించుకున్నారు. కొందరు రైతులు చనిపోవడంతో వారి వారసులు విరాసత్‌  కోసం అప్లై చేసుకుని తమ పేరిట పాస్‌ పుస్తకాలు తీసుకున్నారు. ఇక రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో తప్పులు దొర్లినవారి పాస్బుక్కుల్లో మార్పులు చేశారు. మొత్తంగా వీరంతా వ్యవసాయశాఖ శాఖ ఫీల్డ్ అధికారులకు తమ వివరాలు అందించారు. బ్యాంకు పాస్‌ బుక్లు, ఆధార్‌ కార్డుల వివరాలు ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసుకున్నారు. కానీ గత ఏడాది ఇచ్చినవారికే రైతు బంధు సొమ్ము ఇవ్వాలన్న సర్కారు నిర్ణయంతో.. వారందరికీ పెట్టుబడి సాయం అందకుండా పోయింది.2018 యాసంగిలో 1.31 కోట్ల ఎకరాలకు సంబంధించి 49.03 లక్షల మంది రైతులకు రైతు బంధు అందింది. ఎకరానికి రూ. 4 వేల చొప్పున రూ.5,244 కోట్లను ఇచ్చారు. ఈ ఏడాది యాసంగిలో 1.45 కోట్ల ఎకరాల భూములకు సంబంధించి 59 లక్షల మంది రైతుల పేర్లు నమోదయ్యాయి. కానీ గతంలో సొమ్ము అందిన 49.03 లక్షల మందినే పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులోనూ మరణించినవారు, భూములు అమ్ముకున్నవారు కలిపి మరో లక్షన్నర మందికి కోత పడినట్టు అంచనా. అంటే యాసంగిలో కోటీ 23 లక్షల ఎకరాలకు సంబంధించిన 47.5 లక్షల మందికి మాత్రమే సొమ్ము అందుతుందని.. మిగతా 11.5 లక్షల మంది సాయం కోల్పోయారని అధికార వర్గాలే చెప్తున్నాయిరూల్స్ పెట్టి, కోతలు వేసి లెక్కతేల్చిన 47.5 లక్షల మంది రైతులకు కూడా పూర్తిగా సొమ్ము అందని పరిస్థితి నెలకొంది. వీరందరికీ ఎకరా రూ. 5 వేల చొప్పున ఇవ్వాలంటే.. సుమారు రూ. 6,150 కోట్లు అవసరం. కానీ సర్కారు రూ.5,100 కోట్ల నిధులకు మాత్రమే ఓకే చెప్పింది. అంటే ఇంకో రూ.1,050 కోట్లు తక్కువపడతాయి. సర్కారు ఇటీవలే రైతు బంధుకు రూ.3 వేల కోట్లు విడుదల చేసింది. రెండు, మూడెకరాల్లోపు భూములున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఈసారి అదనంగా మరో 50 వేల మంది రైతులకు కోత పడినట్టేనని అంటున్నారు.రైతుబంధు ప్రారంభించినప్పటి నుంచీ కూడా అందరు రైతులకు పూర్తిగా పెట్టుబడి సాయం అందడం లేదు. ప్రతి సీజన్‌లో రైతుల సంఖ్యకు కోత పడుతోంది. గత సీజన్‌లో అందనివారికి ఈసారీ ఇచ్చేది లేదని ఈ ఏడాది సీజన్‌ ప్రారంభంలో సర్కారు ప్రకటించింది. ఇట్లా 2018–19లో రెండు సీజన్లు కలిపి 14 లక్షల మందికి కోత పెట్టింది. 2019–20 ఖరీఫ్లోనూ ఎనిమిది లక్షల మందికి రైతు బంధు అందలేదు. యాసంగిలోనూ 11.5 లక్షల మందికి రావడం లేదని తేల్చారు.

Related Posts