మార్గం సుగమం (గుంటూరు)
గుంటూరు, ఫిబ్రవరి 12 నిజాంపట్నం హార్బరు విస్తరణకు మార్గం సుగమమైంది. మత్స్యకారుల దశాబ్దాల కల నెరవేరనుంది. హార్బరు రెండోదశ అభివృద్ధికి అవసరమైన సవివర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. రూ.341 కోట్లతో విస్తరణ పనులు చేపట్టడానికి వ్యాప్కోస్ సంస్థ ప్రణాళికలు రూపొందించింది. హార్బరు విస్తరణకు అవసరమైన భూమి అటవీశాఖ నుంచి మత్స్యశాఖకు ఇటీవలే బదిలీ చేశారు. 2.01 హెక్టార్ల భూమి మత్స్యశాఖకు అధికారికంగా అప్పగించడంతో పనులకు అడ్డంకి తొలగిపోయింది. కొన్నాళ్లుగా భూమి బదలాయింపులో అడ్డంకిగా ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయి. దీంతో మత్స్యశాఖ నివేదిక ఆశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపింది. ఇప్పటికే సవివర ప్రాజెక్టు నివేదిక తయారు కావడంతో ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించాల్సి ఉంది. నిజాంపట్నం హార్బరు విస్తరణకు కేంద్రం సాగరమాల ప్రాజెక్టు కింద గుర్తించినందున నిధులు విడుదల కానున్నాయి. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషింగ్ వారి ఆధ్వర్యంలో పనులు జరుగనున్నాయి. మత్స్యశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో ఉండటంతో వీలైనంత తొందరగా పనులు మొదలవుతాయని భావిస్తున్నారు. నిజాంపట్నం హార్బరు ప్రస్తుతం 60 బోట్ల సామర్థ్యంతో పని చేస్తోంది. ఇక్కడ 275 మెకనైజ్డ్ బోట్లు ఉన్నాయి. ఇందులో 215 బోట్లు మత్స్యశాఖ నుంచి రాయితీని పొందుతున్నాయి. దీనికితోడు తుపానుల సమయంలో వేటకు వచ్చిన కాకినాడ, నెల్లూరు, వేటపాలెం తదితర బోట్లు సురక్షితమైన నిజాంపట్నం తీరానికి వస్తున్నాయి. దీంతో బోట్లు నిలుపుకోవడానికి జెట్టీ సామర్థ్యం చాలక ఒకదానికొకటి బోట్లు ఢీకొని మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా హార్బరు విస్తరించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రకృతి పరంగా తుపాన్లు నిజాంపట్నంలో తీరం దాటే అవకాశాలు చాలా తక్కువ. దీంతో బోటు యజమానులు తుపానుల సమయంలో బోట్లు నిలుపుకోవడానికి నిజాంపట్నం హార్బరుకు వస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రస్తుతం ఏటా రూ.300 కోట్ల నుంచి రూ.350 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. సరైన మౌలిక వసతులు లేకపోవడంతో ఆక్వా ఉత్పత్తులు ఆశించినంతగా ఎగుమతి చేయలేని పరిస్థితి నెలకొంది. హార్బరులో మౌలిక వసతులు కల్పించడంతోపాటు ప్రాసెసింగ్ యూనిట్లు వస్తే ఇక్కడి నుంచి ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు పెరగనున్నాయి. దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరలు దక్కుతాయి. జిల్లాలో ఏకైక హార్బరు ఇదే కావడంతోపాటు మచిలీపట్నం హార్బరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అభివృద్ధి చేయడానికి అనుకూలమైన అంశాలు ఎక్కువగా ఉన్నాయని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. నిజాంపట్నం హార్బరులో జెట్టీని 300 మెకనైజ్డ్ బోట్లు నిలిచేలా విస్తరించనున్నారు. ఇందుకు సంబంధించిన భూమి అటవీశాఖ నుంచి మత్స్యశాఖ సమకూర్చుకుంది. దీంతో జెట్టీ విస్తరించడంతోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తారు. సముద్ర ముఖద్వారం నుంచి 500 మీటర్ల మేర మొగ మరో 500 మీటర్ల పొడవు పొడిగించాలని నిర్ణయించారు. దీనివల్ల హార్బరు నుంచి సముద్రంలోకి బోట్లు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు ఉండవు. దీంతోపాటు మత్స్యసంపద నిల్వ చేయడానికి వీలుగా శీతల గోదాము సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తారు. హార్బరులోనే ఆక్వా ఉత్పత్తులను గ్రేడింగ్ చేసి శుభ్రపరచడం, ఎగుమతికి ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. హార్బరు రెండోదశ విస్తరణలో భాగంగా సౌకర్యాలు సమకూరనున్నాయి.