నల్లమలలో శివనామస్మరణ
కర్నూలు, ఫిబ్రవరి 13
నల్లమల అభయారణ్యం శివ నామస్మరణతో మారుమోగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు కాలినడకన నల్లమల దారిలో శ్రీగిరికి చేరుకుంటున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం, జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున శివ భక్తులు రోడ్డు మార్గంలో వెంకటాపురం చేరుకుని అక్కడి నుంచి నాగలూటి, పెచ్చుర్వు మఠం బావి, భీముని కొలను మీదుగా కైలాసద్వారం చేరుకుని శ్రీశైలానికి చేరుకుంటున్నారు. అడుగడుగునా కష్టాలు ఎదురైనా స్వామి మీద ఉన్న అపారమైన భక్తివారిని ముందుకు నడిపిస్తోంది.నాగలూటి క్షేత్రం నుంచి మొదలయ్యే మెట్ల మార్గంలో అవస్థలు పడుతున్నారు. శిథిలమైన దారిలో రాళ్లు భయపెడుతున్నాయి. ఓ వైపు పిల్లలు, మరో వైపు లగేజీతో బొబ్బలెక్కిన కాళ్లతో అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. కత్తులకొండ ప్రాంతంలో మొనదేలిన రాళ్లపై నడవలేక పోతున్నారు. శ్రీశైల దేవస్థానం సౌకర్యాలను విస్మరించడంతో వైద్యం అందక, మంచినీటి వసతి లేక భక్తులు కష్టాలు అన్నీఇన్నీ కావు. అక్కడక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు రెండు, మూడు గంటలు మాత్రమే పని చేస్తున్నాయి. దీంతో భక్తులు అస్వస్థతకు గురైన దేవుడిపై భారం వేసి ముందుకు సాగుతున్నారు.