YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో మొదలైన భూ కబ్జాలు

విశాఖలో మొదలైన భూ కబ్జాలు

విశాఖలో మొదలైన భూ కబ్జాలు
విశా ఖపట్టణం, ఫిబ్రవరి 13,
విశాఖ అంటే అందమైన నగరం. మరో పేరు చెప్పమంటే ప్రశాంత నగరం. ఇంకా చెప్పమంటే రిటైరైన వారికి ఆనంద ప్రస్థానం. అటువంటి విశాఖలో ఒక ఇల్లు కొనుక్కుని సాఫీగా, తాపీగా బతుకు బండి లాగించేయాలని అంతా అనుకుంటారు. ఇపుడు రాజధాని పేరిట మొదలైన హడావుడి చూసి సీనియర్ సిటిజన్లు హడలిపోతూంటే విశాఖ అందాలను ప్రేమించే వారూ వణుకుతున్నారు. ఇక విశాఖల హ్యాపీగా జాబ్స్ చేసుకునే వారు కూడా ఇకపై రద్దీ జిందగీతో గుద్దులాటేనా అని అసహనపడుతున్నారు. రాజధానిగా విశాఖ మారితే రాజయోగం ఎవరికి పడుతుంది అని సగటు జనం వేస్తున్న ప్రశ్నలూ దీనికి అదనం. ఇదీ వర్తమన విశాఖ జనం మనోగతం. ఇక విశాఖలో అసలే భూముల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇపుడు రాజధాని ప్రకటనతో ఇంకా జోరు మీదున్నాయి.మరో వైపు విశాఖలో భూములకు రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నాయట. నిజానికి విభజన తరువాత విశాఖలో భూ కబ్జాలు దారుణంగా పరిగిపోయాయి. అదెంతవరకు వచ్చిందంటే ప్రజా ప్రతినిధుల ఖాళీ జాగాలను కూడా నమిలి మింగేసేటంతగా భూముల దందా సాగిపోయింది. ఇలా వేలల్లో భూములు కబ్జా గద్దలు ఆక్రమించేశాయి. దాని మీద చంద్రబాబు సర్కార్ సిట్ విచారణ జరిపించినా కూడా అసలు దోషులు బయటపడలేదు. అలా నివేదికను సైడ్ చేసేశారు. ఇపుడు ఏకంగా రాజధానే రావడంతో కబ్జా కోరుల కళ్ళల్లో మరో మారు ఆనందం కనిపిస్తోందట.విశాఖ భూముల మీద కబ్జా కోరుల కన్ను పడింది. ఇక్కడివారే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా లుంగీ బ్యాచులు దిగిపోతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ భూ కబ్జాల లీలలు ఏ రేంజిలో ఉన్నాయంటే ఏకంగా విశాఖ వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నా పేరు మీద ఎవరైనా భూముల దందా చేస్తే కఠిన చర్యలు తీసుకోండంటూ మీడియాముఖంగానే అధికారులకు విన్నవించుకున్నారు. ఇతర జిల్లాల నుంచి అంగబలం, అర్ధబలం కలిగిన ఆసాములు రాత్రికి రాత్రి దిగిపోయి భూములను పరుపుని చుట్టినట్లుగా చుట్టేస్తున్నారని టాక్. పత్రం, కాగితం లేకుండానే దర్జాగా కబ్జా చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.ఇదిలా ఉండగా భూకబ్జా కేసులు ఎన్నడూ లేని విధంగా గత కొన్ని నెలల్లో పెరిగిపోవడంతో విశాఖ వాసులు ఆందోళన పడుతున్నారు. నిజానికి విశాఖలో నివాసం ఉన్న వారు కాకుండా ఇక్కడ ఉద్యోగాలకు వచ్చిన వారు కూడా తమకు ఒక స్థలం ఉండాలని కొనుక్కుని ఖాళీగా ఉంచుకున్నవి కూడా కబ్జాకోర్లు చప్పరించేస్తున్నారు. ఇక ఎక్కడో విదేశాలో ఉంటూ కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో ఇక్కడ భూములు కొనుక్కున్న వారు సైతం తాజా పరిణామాలతో బెంబేలెత్తుతున్నారు. తమ భూములను కాకుండా చేస్తారా అని ఆందోళనపడుతున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ అని కాదు ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ పాగా వేస్తే కబ్జా బ్యాచులకు అధికారుల, రాజకీయ పెద్దల అండదండలు ఉండడంతో విశాఖలో భూములనీ హాంఫట్ అయిపోతున్నాయని అంటున్నారు. ఇపుడే ప్రభుత్వ పెద్దలు మేలుకుని భూదందాల మీద ఉక్కుపాదం మోపకపోతే మరో అమరావతి కధగా విశాఖ కూడా మారుతుందని నగరవాసులు అంటున్నారు.

Related Posts