YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

 కేజ్రీ బాటలో జేడీ అడుగులు

 కేజ్రీ బాటలో జేడీ అడుగులు

 

 కేజ్రీ బాటలో జేడీ అడుగులు
విశాఖపట్టణం, ఫిబ్రవరి 13,
ఒకరు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ ఇమేజ్ వున్న వ్యక్తి. మరొకరు అంతేస్థాయిలో తెలుగు మీడియా హీరో ని చేసిన అధికారి. వీరిద్దరు ఎవరో అందరికి తెలిసిందే. వారే పవన్ కళ్యాణ్, మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ. ప్రజలకు సేవ చేసేందుకు తాము పనిచేసే వ్యవస్థలకు గుడ్ బై కొట్టి రాజకీయ కదనరంగంలోకి సింహాల్లా దూకారు. జనం కూడా ఆహా ఓహో అన్నారు. ఇక మీడియా కు దొరికిన సెలబ్రెటీ పొలిటికల్ లీడర్స్ చిటికేస్తే బ్రేకింగ్ న్యూస్ గా నడిపాయి. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన వీరిద్దరూ ఒకే పార్టీ గొడుగు కిందకు చేరారు. పవన్ స్థాపించిన జనసేన ను అధికార తీరానికి చేర్చేస్తామనే ధీమాతో కలలు కన్నారు. కట్ చేస్తే వారి పార్టీ పడవ తీరం చేరకుండానే బోల్తా కొట్టేసింది. సింగల్ డిజిట్ పార్టీ గా జనసేన మారడం ఆ తరువాత ఎవర్ని పార్టీలో సంప్రదించకుండా అధినేత పవన్ కల్యాణ్ బిజెపి తో పొత్తు పెట్టుకోవడం తో లక్ష్మీనారాయణ ఆ పార్టీకి బై బై చెప్పేయడం చకచకా జరిగిపోయాయి.ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టిన కేజ్రీవాల్ తీరు చూద్దాం. ఉన్నతాధికారిగా తన పదవిని వదులుకుని రాజకీయ రంగప్రవేశం చేశారు కేజ్రీవాల్. అవినీతి కి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమ ప్రేరణ తో ఉద్భవించిన ఆయన పార్టీ ఆప్ కి తొలిదఫాలో పెద్దగా యంత్రాంగం లేదు అనుభవం లేదు. అయినా కానీ 2013 లో ఆప్ అధినేత చిత్తశుద్ధి ని గుర్తించిన జనం ఆయనకు 28 సీట్లు కట్టబెట్టి ఆశీర్వదించారు. కాంగ్రెస్ తో జట్టు కట్టి కొద్ది కాలమే ముఖ్యమంత్రి అయి పదవీచ్యుతుడి గా సానుభూతితో 2015 లో బిజెపికి మూడు అంటే మూడే స్థానాలు వదిలి 67 సీట్లు తమఖాతాలో పడేలా ఊడ్చేసింది ఆప్. బలమైన జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ లను ధీటుగా ఎదుర్కొని పరిపాలనలో సరికొత్త పనితనం ప్రదర్శించి మూడోసారి అధికారం దక్కించుకుని ప్రత్యర్థి కి 8 సీట్లు మాత్రమే ఇచ్చి అన్ని గెలిచారు ఆప్ బృందం.రాజకీయాల్లో ఓర్పు, నేర్పు చిత్తశుద్ధి చాలా అవసరం. పార్టీలో క్రమశిక్షణ మరింత ముఖ్యం. అవకాశం ప్రజలు ఇచ్చేవరకు ఆచితూచి 24 గంటలు వారికోసమే తమ జీవితం అనే స్థాయిలో ఒక రాజకీయ పార్టీ నిరూపించుకోవాలిసి ఉంటుంది. కేజ్రీవాల్ అదే చేశారు. అందుకే మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టి అన్ని పార్టీలకు ఆదర్శం అయ్యారు. ఇక్కడే జనసేన కానీ అంతకుముందు పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఫెయిల్యూర్ కి ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి. లక్ష్మినారాయణ వంటివారు సైతం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం నిలకడలేని తనం చూపించి దెబ్బయి పోయారు. సినిమాల్లో నటించ బోను అని చెప్పిన జనసేనాని చివరికి ఆర్ధిక నష్టాలు సాకుగా చూపి పార్ట్ టైం సినిమాలు ఫుల్ టైం జనం బాట అనడం ఆ పార్టీకి మైనస్ గానే పరిణమించింది. దీన్నే సాకుగా చూపి లక్ష్మీనారాయణ వంటి స్టార్ డం వున్న సెలబ్రిటీ జనసేన ను వీడి వెళ్లిపోయారుఅంటే సక్సెస్ దక్కితేనే పవన్ కల్యాణ్ వెంట ఉంటాం కానీ ఫెయిల్యూర్ ను మేం తట్టుకోలేం అనే ధీరీ ఒక మేధావి తీసుకోవడం ఆశ్చర్యమే. బలమైన టిడిపి ని ఎదుర్కొని వైసిపి అఖండ విజయం సాధించడంలో ఫ్యాన్ పార్టీ అధినేత గత 9 ఏళ్ళుగా ప్రజల్లో ఉండి పోరాటం చేయడమే అన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో అధికారం అనేది అందని ద్రాక్ష అయితే ఏమి కాదని నేతలు వేసే ప్రతి అడుగు ప్రజలు నిరంతరం గమనిస్తూ ఉంటారని నిలకడలేని రాజకీయ వ్యవస్థలో నడిచే వారికి పగ్గాలు అప్పగిస్తే ప్రమాదమని ఆలోచించే వారు తీర్పులను విలక్షణంగా విభిన్నంగా ఇస్తారన్నది అనేక ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. ఢిల్లీ లో ఆప్ అఖండ విజయం ఆ పార్టీ ని సింగిల్ హ్యాండ్ తో విజయతీరాలకు చేర్చిన కేజ్రీవాల్ ద్వారా చెబుతున్నది ఒక్కటే నిత్యం ప్రజల్లో ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం రొటీన్ గా మారుతుందనే. మరి ఈ సక్సెస్ మంత్రను ఎవరు పాటిస్తే వారిదే విజయలక్ష్మి.

Related Posts