భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు
నల్గొండ, ఫిబ్రవరి 13,
మార్కెట్ రేట్లలకు తగ్గట్లు ల్యాండ్, ఇండ్లు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లకు కొత్తగా విలువ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రిజిస్ట్రేషన్లు ఖరీదు కానున్నాయి. మార్చి ఒకటి నుంచి భూముల కొత్త మార్కెట్ విలువ అమల్లోకి తేవాలనుకుంటున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత రేట్ల పెంపు ఉంటుందని తెలుస్తోంది. లేదంటే 2019–2020 ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయ్యే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి భూముల కొత్త ధరలు ఖాయంగా అమలులోకి వస్తాయని సమాచారం. ఇందుకోసం రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తే బాగుంటుందని కూడా ఆఫీసర్లు ప్రతిపాదించినట్లు తెలిసింది. పైఆఫీసర్ల ఆదేశం మేరకు జనవరిలోనే సబ్‌రిజిస్ట్రార్లంతా భూముల విలువల పెంపుపై ప్రపోజల్స్ పంపారు. అయితే అవి సరిగ్గా లేవని తిప్పి పంపడంతో ఇటీవలే రివైజ్డ్ ప్రపోజల్స్ కూడా పంపారు. అవి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వద్దకు చేరాయి.ముందుగా రెడీ చేసి ఇచ్చిన ఫార్మాట్‌లోనే భూముల ప్రస్తుత విలువ, పెంచాల్సిన విలువను కోట్ చేసి పంపినట్లు తెలిసింది. సాధారణంగా భూమికి.. సాగు భూమి, వ్యవసాయేతర భూమి అనే రెండు కేటగిరీల్లో ధర కడుతరు. సాగుభూమికి ఇదివరకటి లాగే ఎకరా చొప్పున రేటు నిర్ధారించారు. వ్యవసాయేతర భూమికి మాత్రం ఈ సారి పట్టణాలు, నగరాల్లో ఉండే వార్డు, డివిజన్లవారీగా ఇండిపెండెంట్ ఇండ్లు, అపార్ట్‌మెంట్లు, ఓపెన్ ప్లాట్లకు వేర్వేరుగా విలువ కడతూ ప్రత్యేకంగా ప్రపోజల్స్ రెడీ చేసినట్లు సమాచారం. హెచ్ఎండీఏ పరిధితోపాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ జోరుగా ఉన్న ఇతర మెయిన్ సిటీలు, టౌన్ల శివారులో భూముల రేట్ల పెంపుపైనే సబ్ రిజిస్ట్రార్లు ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలిసింది.ఉమ్మడి ఏపీలో 2013 ఆగస్టు నెలలో భూముల రేట్లు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి. అప్పటి రిజిస్ట్రేషన్ వ్యాల్యూకు, మార్కెట్ ధరకు తేడా ఉండడంతో రావాల్సి ఆదాయం లాస్ అవుతోంది. దీంతో ఏరియాను బట్టి బహిరంగ మార్కెట్‌లో పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న విలువను 30 శాతం నుంచి 100 శాతం వరకు పెంచనున్నట్టు సమాచారం. పెరిగిన భూముల విలువను బట్టి మొత్తం విలువలో 0.5 శాతాన్ని రిజిస్ట్రేషన్ చార్జీగా వసూలు చేయనున్నారు.రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ప్రపోజల్‌తో భూము లు కొని అమ్మడం పెరిగింది. రోజుకు 4 వేల నుంచి 4,500 రిజిస్ట్రేషన్లు జరిగేవని… ప్రస్తుతం ఆ సంఖ్య 5,500 వరకు పెరిగిందని ఆ శాఖ అధికారులంటున్నారు. ఈ నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు.