గ్రేటర్ లో ఇక వెంట వెంటనే పర్మిషన్లు
హైద్రాబాద్, ఫిబ్రవరి 13
హైదరాబాద్ లో భవన నిర్మాణాలకు సులభంగా అనుమతులు వచ్చేలా బల్దియా ప్రణాళికలు రచిస్తోంది. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా సులభతరమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త మున్సిపల్ చట్టంలో కొన్ని మార్పులు చేసి గ్రేటర్‌లో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో భవన నిర్మాణ అనుమతులు తీసుకోవాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. బిల్డింగ్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చెప్పులరిగేలా అధికారులు చుట్టూ తిరగాల్సిందే. అప్లికేషన్ పెట్టున్న వారం పది రోజుల తర్వాత అధికారులు పరిశీలించి... మరిన్ని డాక్యుమెంట్స్ కావాలంటూ తిప్పుతుంటారు. ముఖ్యంగా రెవెన్యూ స్కెచ్, ల్యాండ్ యుటిలైజేషన్ సర్టిఫికెట్, ఫైర్ డిపార్ట్‌మెంట్ క్లియరెన్స్, సివిల్ ఏవియేషన్, ఇరిగేషన్ లాంటి అనుమతుల్ని కావాలంటూ సవాలక్ష రూల్స్ చెప్తారు. వీటికోసం మరో పది రోజులపాటు వివిధ విభాగాల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిందే. ఈ క్రమంలో అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. జనానికి ఇలాంటి కష్టాలన్నీ తప్పించేందుకు... టీఎస్ ఐపాస్ తరహాలోనే బిల్డింగ్ పర్మిషన్ కోసం బి-పాస్ అనే కొత్త విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.బి-పాస్ పద్ధతిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో వీలైనంత వేగంగా అనుమతులు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించింది ప్రభుత్వం... అందులో నిర్మాణ అనుమతుల్ని సరళతరం చేసింది. సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా నిర్మాణ అనుమతుల్ని వేగంగా ఇవ్వడానికి అన్ని అవకాశాలు కల్పించింది. ప్రభుత్వ ఆదేశాలతో దానికి అనుగుణంగా హైదరాబాద్ సిటీకి వర్తించేలా చిన్నిచిన్న మార్పులతో రూల్స్ రూపొందించే పనిలో ఉన్నారు బల్దియా అధికారులు. తరువాత మున్సిపల్ చట్టాన్ని మార్చడం ద్వారా అవి అమల్లోకి వస్తాయి. నిర్మాణదారులు ఇబ్బందులకు గురికాకుండా చేయడమే దీని లక్ష్యం. అధికారులతో తక్కువ ఇంటర్ ఫేస్ ఉండేలా... ఆర్కిటెక్చర్ దగ్గరికి కూడా వెళ్లకుండా... 500 గజాల్లోపు నిర్మాణ అనుమతులు ఈజీగా పొందవచ్చంటున్నారు బల్దియా అధికారులు.బల్దియా ఏటా 16వేల నుంచి 18వేల అనుమతులు ఇస్తుంది. ఇందులో 80శాతం నుంచి 90శాతం వరకు 500 చదరపు గజాల్లోపు నిర్మాణాలే. వీరందరికీ బి-పాస్ విధానంలో భవన నిర్మాణం సులువు కానుంది. 75 చదరపు గజాల్లోపు ఉన్న స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఒక అంతస్తు నిర్మించుకోవచ్చు. 75 గజాల నుంచి 200గజాల వరకైతే... గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తులు.... లేదా స్టిల్ట్ ప్లస్ మూడంతస్తులు నిర్మించుకోవచ్చు. వీరంతా బల్దియాకు నిర్ణీత రుసుము చెల్లించడంతో పాటు అవసరమైన సమాచారం ఇచ్చి భవనాల నిర్మాణం మొదలుపెట్టొచ్చు. సెల్ఫ్ డిక్లరేషన్ కంటే కంటే ఎక్కువ అంతస్తుల్లో భవనాన్ని నిర్మిస్తే... ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేసే అధికారం కార్పొరేషన్‌కు ఉంటుంది.మరోవైపు 500గజాల వరకు కూడా ఇలాంటి నిబంధనలే వర్తింపజేయాలని ప్లాన్ చేస్తున్న బల్దియా అధికారులు. 500 చదరపు గజాలు దాటితే మాత్రం టీఎస్- బిపాస్‌కు అనుసంధానం చేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ మా ఇల్లు పేరుతో ఇంటి నిర్మాణ డిజైన్లను అందుబాటులోకి తెచ్చింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న సర్కిల్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా వాటిని అందుబాటులో ఉంచారు. అక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదిస్తే స్థలానికి అనుగుణంగా డిజైన్లను... అవసరమైన ధ్రువపత్రాల గురించి వివరిస్తారు. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయంతో గ్రేటర్‌లోనూ నిర్మాణ అనుమతులు మరింత వేగంగా పోందేందుకు అవకాశం ఏర్పడనుంది.