YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సంజయ్ పై మండిపడుతున్న స్థానిక నేతలు

సంజయ్ పై మండిపడుతున్న స్థానిక నేతలు

 సంజయ్ పై మండిపడుతున్న స్థానిక నేతలు
కరీంనగర్, ఫిబ్రవరి 13,
కరీంనగర్ కమలం పార్టీలో కల్లోలం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీలో చోటు చేసుకున్న విభేదాలు... ఎన్నికలు ముగిసే నాటికి తారస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల్లో తక్కువ సీట్లు రావడం వెనుక కారణాలపై పోస్టుమార్టం మొదలైంది. గెలుపు గుర్రాలను పక్కన పెట్టి, రేసులో లేని గుర్రాలను ట్రాక్‌లోకి తీసుకురావడమే ఎఫెక్ట్‌ చూపించింది. రేసుకు పనికి రాని గుర్రాలను తీసుకు రావడం వెనుక అసలు కారణం ఆయనేనంట.లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ నియోజకవర్గంలో సత్తా చాటిన బీజేపీ... మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే తరహలో ఫలితాలు సాధిస్తుందని భావించింది. 25 నుంచి 28 సీట్లను సాధిస్తుందని అంచనాలు వేసుకున్నా ఫలితాలొచ్చాక పార్టీ నేతలు కంగుతిన్నారు. 13 డివిజన్లకే పరిమితం కావడంతో పొరపాటు ఎక్కడ జరిగిందనే విషయమై చర్చ మొదలైంది. అంతా జరిగిపోయాక ఇప్పుడు లెక్కలేసుకుంటే లాభమేంటని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఫలితాలు ఇలా రావడానికి కారణం ఒక్కరే అంటున్నారు. ఆయనే ఎంపీ బండి సంజయ్‌ అని చెబుతున్నారు. ఆయన ఒంటెద్దు పోకడలే కారణమని వ్యతిరేక వర్గీయులు విమర్శిస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రజల్లో బీజేపీపై అభిమానం ఉన్పప్పటికి వాటిని ఓట్లుగా మలచుకోవడంలో నేతలు విఫలమయ్యారట. ఎంపీ సంజయ్ తన అనుచరులకే ప్రాధాన్యం కల్పించి, గెలిచే వారిని పక్కన పెట్టారని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ రెబల్‌గా బరిలోకి దిగిన వారంతా తక్కువ ఓట్లతో ఓడిపోయిన వారున్నారు. వారికి పార్టీ టికెట్‌ ఇచ్చి ఉంటే సంఖ్యా బలం పెరిగేదని చెబుతున్నారు. బీజేపీ హవాలో సైతం తక్కువ సీట్లను సాధించడం పట్ల ఓ వర్గం నేతలంతా సంజయ్ తీరును తప్పు పడుతున్నారు.టిక్కెట్ల కేటాయింపు మొదలు ప్రచారం వరకు సంజయ్ తీసుకున్న నిర్ణయాలు అసమ్మతి వర్గానికి మింగుడు పడడం లేదట. బీజేపీకి మంచి పట్టున్న రెండు డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం కావడం పట్ల పార్టీవర్గాలు గుర్రుమంటున్నాయి. 200 కంటే తక్కువ ఓట్లతో 12 మంది బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఒకవేళ వారిని ఎంపీ సంజయ్ సమన్వయపరచి ఉంటే 25 సీట్లు తప్పకుండా వచ్చేవని సీనియర్లు అంటున్నారు. నిఘా వర్గాలు సైతం బీజేపీకి సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే నివేదికలు ఇచ్చాయట. అయితే ఫలితాల నాటికి సగం సీట్లకే పరిమితమవడాన్ని పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. ఎంపీ సంజయ్‌పై ఆధారాలతో సహా హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారట.కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓ రకంగా అనుకూల వాతవరణం ఉందనేది చాలా మంది అభిప్రాయం. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, టీఆర్ఎస్‌కు రెబల్స్‌ పోటును అనుకూలంగా మలచుకోవడంలో బీజేపీ విఫలమైందని జనాలు అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఎంపీ బండి సంజయ్ పార్టీ శ్రేణులను కాదని, వలస వచ్చిన వారితో పాటు ప్రజల్లో పట్టు లేని వారికి ప్రాధాన్యం ఇవ్వడం లాంటి కారణాలే పార్టీ కొంప ముంచాయని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. అందరినీ కలుపుకొని పోయి ఉంటే తప్పకుండా మెరుగైన ఫలితాలు వచ్చేవని అంటున్నారు. మొత్తం మీద పార్టీలోని వర్గ విభేదాలు దెబ్బ తీశాయనే టాక్‌ అయితే ఉంది.

Related Posts