పీకల్లోతు కష్టాల్లో పాడి రైతులు
కడప, ఫిబ్రవరి 14,
కడప జిల్లాలోని పాడి రైతుల కష్టాన్ని ప్రైవేటు డెయిరీలు దోపిడీ చేస్తున్నాయి. పాలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా మొండి చేయి చూపుతున్నాయి. దీంతో రైతుల ఆర్థిక పరిస్థితి చితికి పోతోంది. వెన్నశాతం పేరుతో తక్కువ ధరలు నిర్ణయిస్తూ పాలదోపిడీకి పాల్పడుతున్నాయి. ఇందులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ కూడా భాగస్వామ్యం కలిగి ఉందని పాడి రైతులు ధ్వజమెత్తుతున్నారు. గత ప్రభుత్వంలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు డెయిరీలు పుట్టుకొచ్చాయి. అవి చేస్తున్న దోపిడీ వ్యాపారాలను పట్టించుకోక పోవడంతోనే నేటి ధరలు పాడి రైతులకు శాపంగా మారాయి.ప్రైవేటు డెయిరీల పాలదోపిడీతో పాడి పశువుల పోషణ భారంగా మారింది. గతిలేని పరిస్థితిలో ఆ డెయిరీలకు పాలను పోస్తున్నారు.జిల్లాలోని రైతాంగం అధిక శాతం పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తోంది. దాదాపు 1.50 లక్షల మంది పంటల సాగు, పాడి పశువుల పోషణతో జీవనం సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆవులు 1,38,132, బర్రెలు 4,57,504 ఉన్నాయి. ఇందులో పాలిచ్చే ఆవులు 46,485, బర్రెలు 1,50,658 ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 2,25,900 లీటర్ల నుంచి 2,32,625 లీటర్ల వరకు పాల ఉత్పత్తి వస్తోంది. అందులో 90,832 లీటర్ల నుంచి 1,05,658 లీటర్ల పాలను రైతులు గ్రామాల్లోని, పట్టణాల్లోని వినియోగదారులకు విక్రయిస్తుండగా మిగతావి ప్రైవేటు డెయిరీలకు పోస్తున్నారు. పాలను అమ్మగా వచ్చిన ఆదాయంతో పశువుల కాపాడుకుంటున్నారు. కుటుంబాలను పోషించుకుంటున్నారు. పాలలో అత్యధికంగా ప్రైవేటు డెయిరీలకే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేటు డెయిరీలు పాడి రైతులను నిలువునా దోచుకుంటూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నాయి. లీటరు పాలకు సాలీడ్ నాన్ ఫ్యాట్ (ఎస్‌ఎన్‌ఎఫ్), ఫ్యాట్‌ల ఆధారంగా పాలకు ధర నిర్ణయించడం, ట్యాక్స్‌ల పేరుతో మరికొంత కోత కోస్తున్నారు. సాధారణంగా పాలను కొలత పాత్రలో పోసి ల్యాక్టో మీటరు (ఎల్‌ఆర్) ఆధారంగా ఎస్‌ఎన్‌ఎఫ్ 8.5 శాతం, ఫ్యాట్ 4.5 మేరకు రీడింగ్ వస్తే లీటరుకు రూ.35 నుంచి 40లు నిర్ణయించాల్సి ఉంది. కానీ రూ.25 నుంచి 27లు వరకు మాత్రమే ధరను నిర్ణయించి ఇస్తున్నారు. రైతులను నిలువు దోపిడీ చేసేందుకు రోజుకో ప్రైవేటు డెయిరీ పుట్టుకొస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 15 ప్రైవేటు డెయిరీలు పాల సేకరణను చేస్తున్నాయి. ఇవి రోజుకు 1,35,068 లీటర్ల నుంచి 1,26,967 లీటర్ల పాలు రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. 2004లో అధికారంలోకి వచ్చిన అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాడి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పశుక్రాంతి పథకాన్ని తీసుకొచ్చి వారి కు టుంబాల్లో సంతోషం నింపారు. 2006లో డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో పాల శీ తలీకరణ (బీఎంసీయూ) కేంద్రాలను ఏర్పాటు చే యించారు. పాలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సబ్సిడీపై దాణా, గడ్డి విత్తనాలు, పోషకా ల మందులు ఇచ్చేవారు మొత్తం 1.20 లక్షల లీట ర్ల పాలను విజయా డెయిరీ వారు సేకరణ చేసేవారు. పాడి రైతులకు ఎంతో ఊరట లభించేది. కడప జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల కుటుంబాల రైతులు విజయా డెయిరీకి నిత్యం పాలుపోసి జీవనం సాగిస్తున్నారు. 1999లో, 2014 లోనూ తన సొంత హెరిటేజ్ డెయిరీ అభివృద్ధి కోసం విజయా డెయిరీని నిలువునా ముంచారు ఎన్నికలు ముగియగానే దాన్ని కాస్తా రూ.54 చేశారు. ప్రస్తుతం లీటరు పాల ప్యాకెట్ ధర రూ.60 చేశారు. మిగతా డెయిరీలు కూడా లీటరు రూ.60 ధరతో ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. ఇది దోపిడీ కాదా అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రైతుల వద్ద మాత్రం లీటరుకు రూ.25 నుంచి 27లకు కొనుగోలు చేసి అధిక లాభంతో అవే పాలను ప్యాకెట్లు చేసి విక్రయిస్తారా? అని ధ్వజమెత్తుతున్నారు.