YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 నిట్‌ నీటుగా..(పశ్చిమగోదావరి)

 నిట్‌ నీటుగా..(పశ్చిమగోదావరి)

 నిట్‌ నీటుగా..(పశ్చిమగోదావరి)
ఏలూరు, ఫిబ్రవరి 14 ): ఏపీ నిట్‌ శాశ్వత ప్రాంగణంలో ఫేజ్‌-1 కింద రూ.196 కోట్లతో చేపట్టిన భవన నిర్మాణ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. రూ.256 కోట్లతో చేపట్టనున్న మూడో దశ భవన నిర్మాణ పనులకు సంబంధించిన డిజైన్ల(ఆకృతులు)కు సెంట్రల్‌ పబ్లిక్‌వర్క్సు డిపార్ట్‌మెంట్‌ అధికారులు రూపకల్పన చేస్తున్నారు. వాటిని త్వరితగతిన పూర్తిచేసి త్వరలో నిర్వహించనున్న బోర్డు ఆఫ్‌ గవర్నెన్స్‌(పాలకమండలి)లో ఆమోదించనున్నారు. అనంతరం ఆయా పనులకు టెండర్లు పిలిచి త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. రెందో దశ నిర్మాణాల్లో అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌, గ్రంథాలయం, స్టూడెంట్స్‌ యాక్టివిటీస్‌ సెంటర్‌, బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు, డైరెక్టర్‌ బంగ్లా, అకడమిక్‌ బిల్డింగ్‌, ఆసుపత్రి, ఆడిటోరియం, ఇండోర్‌స్టేడియం వంటివి చేపట్టనున్నారు. వీటిని 5.50 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్‌-2 నుంచి జీ ప్లస్‌-5 కేటగిరీల్లో నిర్మించనున్నారు. ప్రస్తుతం ఆయా భవన నిర్మాణపనులు చకచకా సాగుతున్నాయి. సంస్థలో నాలుగేళ్లకు కలిపి 1721 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరితోపాటు పీహెచ్‌డీ విద్యార్థులు మరో 50 మంది అదనంగా ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సంస్థలో సీట్ల సంఖ్య 480 నుంచి 750కి పెరగనుండడంతోపాటు ఎంటెక్‌ కోర్సులు అమలు చేయనున్నారు. ఫలితంగా విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని నిట్‌ అధికారులు నిర్మాణాలను త్వరితగతిన వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. గతంలో ఇసుక కొరతతో నిర్మాణాల్లో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం అటువంటి ఇబ్బందులేమీ లేకపోవడంతో నిర్మాణాల్లో వేగం కనిపిస్తోంది. మూడో దశలో రూ. 256 కోట్లతో భవనాలను నిర్మించనున్నారు. ఇందులో ల్యాబ్, ఫ్యాకల్టీ, స్టాఫ్ క్వార్టర్స్, బాలురు, బాలికల వసతి గృహాలు, 1700 మంది విద్యార్థులకు తగ్గట్టు అకడమిక్‌ భవనం వంటి వాటిని జీప్లస్‌-2 నుంచి జీప్లస్‌-9 తరహాలో నిర్మించనున్నారు. ప్రస్తుతం ఆయా భవన నిర్మాణాలకు సంబంధించి డిజైన్లు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సంస్థలో మొత్తం 1771 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థికి తాగునీటితో పాటు ఇతర అవసరాల నిమిత్తం వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నిబంధనల ప్రకారం రోజుకు 150 లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఏడు విద్యుత్తు మోటార్ల ద్వారా నిత్యం మూడు లక్షల లీటర్ల భూగర్భ జలాలను తోడుతున్నారు. మరో 2 లక్షల లీటర్ల నీటిని తోడి భవన నిర్మాణపనుల నిమిత్తం వినియోగిస్తున్నారు. భూగర్భ జలాలను వినియోగించడం ద్వారా కొంతమంది విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది సంఖ్య భారీగా పెరగనుంది. వారందరూ వస్తే రోజుకు 7.50 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. నీటిని పురపాలక సంఘం నుంచి సరఫరా చేయాలని నిట్‌ అధికారులు పాలకులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే పైపులైన్‌ నిర్మాణం పూర్తవడంతో విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు. ప్రాంగణంలోని బాలికలు, బాలురు వసతి గృహాలతోపాటు మరో రెండు ప్రాంతాల్లో 6.50 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసుకునే సంపులను నిర్మించారు. భవిష్యత్తులో ఏదైనా అనివార్య కారణాలతో నీటి సరఫరా నిలిచిపోయినా 3, 4 రోజుల వరకు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో మరో 20 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసేవిధంగా భారీస్థాయిలో సంపును నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని నిట్‌ అధికారులు వివరించారు.

Related Posts