YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

లెక్కేది రామా...?

లెక్కేది రామా...?

లెక్కేది రామా...? (ఖమ్మం)
భద్రాచలం, ఫిబ్రవరి 14 (న్యూస్ పల్స్): భద్రగిరి మహా పుణ్యక్షేత్రం. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతూ భూలోక వైకుంఠమై దర్శనమిస్తోంది. భక్తులు తరతరాలుగా సీతారాముల్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నగదు రూపంలోనే కాకుండా వెండి, బంగారు ఆభరణాల రూపంలో బహుమతులు సమర్పించి మురిసిపోతున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కోవెలలో జానకిరాముల ఆభరణాల లెక్క తేల్చడంలో దేవాదాయ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. భక్తులు మొక్కుల్లో భాగంగా ఇచ్చిన నగలు భద్రంగా ఉన్నాయనే భరోసా కల్పించడంలో అధికారులు అంతులేని నిర్లక్ష్యం చాటుతున్నారు. ఏడాదిగా ఈ ప్రక్రియ కొనసాగించడం విమర్శలకు దారితీస్తోంది. ఆ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి రామయ్య బంగారు, వెండి ఆభరణాల లెక్కలను తేల్చాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పుడు అందరి నోటా వస్తున్న మాట ఇదే. రామాలయంలో దీర్ఘకాలికంగా పని చేస్తున్న ఉద్యోగుల అలసత్వమో..? దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరో..? ఏడాదిగా రాముల వారి ఆభరణాల లెక్కలను చూస్తూనే ఉన్నారు. ఈవోలు విజిటింగ్‌ అధికారుల్లాగా వచ్చి వెళ్తుండటంతో మరింత గందరగోళంగా మారింది. జ్యువెలరీ వెరిఫికేషన్‌ అధికారులు 2019 ఫిబ్రవరిలో ఒకసారి, మార్చిలో మారోసారి వచ్చి బంగారం తూకం వేశారు. వెండి విషయంలో ఇంకా కొన్ని నగలను తూకం వేయలేదు. అప్పటి నుంచి ఇటువైపు రావడం మానేశారు. ఇదెప్పుడు పూర్తవుతుందో అంతు చిక్కడం లేదు. 853 కిలోలకు పైగా వెండి రామయ్యకు ఉంది. అన్ని విధాలుగా 63 కిలోల బంగారం స్వామి ఖాతాలో నమోదైంది. బ్యాంకుల భద్రపర్చిన వాటితోపాటు ఆలయ ప్రాంగణంలో ఉంచిన ఆభరణాలను తూకం వేయాల్సి ఉంది. ధర్మ కాంటాతో వాస్తవ తూకాలను చూడటం 2009 తర్వాత ఇదే. తరుగును అంచనా వేయడంతోపాటు కొత్తగా వచ్చిన ఆభరణాలను కలిపి మొత్తం ఎంత ఉందనేది దేవాదాయ శాఖ ద్వారా ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది. రంగు రాళ్లను తొలగించి తరుగు పోను నికర బంగారం ఎంత అనేది అధికారికంగా చెప్పనప్పటికీ ఇప్పుడున్న దానికంటే పెరిగే వీలుంది. దెబ్బతిన్న బంగారాన్ని లెక్కించి ప్రభుత్వం అనుమతితో బాండ్ల రూపంలో బ్యాంకులో భద్రపర్చే వీలుంది.  రామాలయంలో భద్రత కోసం 10 మంది హోంగార్డులు, 11 మంది ఎస్పీఎఫ్‌ సిబ్బంది వీరికి తోడుగా 20 మంది సెక్యూరిటీ గార్డులు పని చేస్తున్నారు. 60 సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘాను ఉంచుతున్నారు. ఈ వ్యవస్థ నిర్వహణకు ఏడాదికి రూ.కోటిని జీతభత్యాల కింద ఆలయం చెల్లిస్తోంది. భక్తుల రద్దీ వేళ క్యూలైన్లను సక్రమంగా నడపటంతోపాటు ఈ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకూడదన్నది ఈ వ్యవస్థ ఉద్దేశం. కొన్నేళ్ల క్రితం అమ్మవారి మంగళ సూత్రాలు మాయమై పెను వివాదం రగిలింది. కొన్ని రోజుల తర్వాత మంగళ సూత్రాలు లభించినప్పటికీ ఇది ఇక్కడి భద్రతకు సవాల్‌ను విసిరింది. ఏడాది క్రితం ఆలయ ప్రాంగణంలో ఒక వృద్ధుడు ప్రవేశించి చనిపోయే వరకు అతని రాకను గుర్తించలేదు. ఇదీ వైఫల్యమే. ఆ తర్వాత కొన్ని రోజులకు ఓ వ్యక్తి హుండీ నుంచి కానుకలను కాజేసేందుకు ప్రయత్నించి పట్టుపడ్డాడు. హుండీ లెక్కింపులో కానుకలు కాజేసిన సంఘటనలూ ఉన్నాయి. పదేళ్ల క్రితం బంగారం లెక్కల్లో చిక్కులు తలెత్తినట్లు కొందరు సహ చట్టాన్ని ఆశ్రయించారు. తరుగును చూపించే విషయంలో పారదర్శకత లేదన్న వాదనలూ ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం అయిదు కిలోల బంగారంతో కవచాలంకరణ చేశాక మరో కవచం కోసం బంగారం సేకరించారు. ఈ లెక్కలపై విమర్శలు ఉన్నందున ఈ వివరాలను వెల్లడించాల్సి ఉంది.భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు భక్తులు ఇచ్చే ప్రతీ కానుక పట్ల పారదర్శకతను చాటాల్సి ఉందని పలువురు సూచిస్తున్నారు.

Related Posts