లెక్కలు చెప్పని 10వేల మందికి నోటీసులు
హైద్రాబాద్, ఫిబ్రవరి 15,
పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల్లో ఖర్చు ల వివరాలు అందించనివారికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపుతోంది. పంచాయతీ ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి కాగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగి 9 నెలలైంది. అయితే ఇంతవరకు చాలా మంది లెక్కలు అందజేయలేదని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో 5,382 ఎంపీటీసీలు, 538 జడ్పీటీసీలు, 12,751 మంది సర్పంచ్ లు ఉండగా వార్డు సభ్యులు లక్షకు పైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని పార్టీల అభ్యర్ధులు, మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్ధులు కలిపి సుమారు రెండున్నర లక్షల మంది ఉంటారని అంచనా వేశారు. అయితే ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఖర్చుల వివరాలు అందజేయడానికి మార్చి చివరి వరకు సమయం ఉందని, తర్వాత నోటీసులు పంపిస్తామని ఎస్ఈసీ అధికారులు అంటున్నారురాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలకు 2019 జనవరిలో.. ఎంపీటీసీ, జడ్పీటీసీకు మే నెలలో ఎన్నికలు జరిగాయి. రూల్స్ ప్రకారం ఎన్నికలు పూర్తయిన 45 రోజుల్లోగా అభ్యర్థులు తహశీల్దార్ ఆఫీసులో ఎన్నికల ఖర్చుల వివరాలు అందజేయాలి.ఏడాదైనా కూడా చాలా మంది సర్పంచ్ లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎన్నికల్లో పోటీ చసి ఓటమి పాలైనవాళ్లలో చాలా మంది ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయలేదని రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు.ఎన్నికల లెక్కలు సమర్పించనివారిలో ఇప్పటి వరకు 6 జిల్లాలకు చెందిన 10వేల మందికి నోటీసులు పంపామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు ప్పారు. దశలవారీగా 32 జిల్లాల అభ్యర్థులకు నోటీసులు పంపుతామన్నారు. నోటీసు అందుకున్న తర్వాత 15 రోజుల్లోగా ఖర్చు వివరాలు అందచేయాలని లేదా ఎందుకు ఆలస్యమైందో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పారు. అభ్యర్ధులు ఇచ్చిన సమాధానం పట్ల అధికారులు సంతృప్తి చెందితే చర్యలు ఉండవన్నారు. లేకపోతే అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. అనారోగ్యం లేదా విదేశాలకు వెళ్లటం వంటి కారణాలు వ్యాలిడ్ గా ఉంటే మినహాయింపు ఉంటుందన్నారుపంచాయతీ , ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతోపాటు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎస్ఈసీ విధించిన పరిమితికి, అభ్యర్ధులు చేసిన ఖర్చుకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం. అయితే అభ్యర్ధులు మాత్రం ఎస్ఈసీ విధించిన పరిమితికి లోబడే ఖర్చు వివరాలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది.