సిటీలో యదేఛ్చగా అక్రమ నిర్మాణాలు
హైద్రాబాద్, ఫిబ్రవరి 15
అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేయాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. ఇందులోభాగంగా ఆధునిక వాహనాన్ని తెప్పించాలని నిశ్చయించారు. ఎంత ఎత్తైన భవనమైనా, ఎంత పటిష్టమైన పిల్లరైనా పూర్తిగా కూల్చివేసే సామర్థ్యం ఈ యంత్రాల ప్రత్యేకత. ప్రస్తుతం పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఈ వాహనాన్ని ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలను మనుషులతో కూల్చుతున్నారు. కేవలం స్లాబులు, గోడలకు మాత్రమే కూల్చి వదిలేస్తున్నారు. దీం నిర్మాణదారులు మళ్లీ వాటిని పునరిద్ధరించుకుంటున్నారు. ఇటీవల ఉన్నత న్యాయస్థానం అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు కూల్చివేత విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎటువంటి అపోహలకు తావులేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. ఇందులోభాగంగా పుణెలో ఉపయోగిస్తున్న విధంగా ఆధునిక డెమోలిషన్ వాహనాన్ని అద్దె ప్రాతిపదికన తెప్పించాలని నిర్ణయించినట్లు, దీనికి రోజువారీ అద్దె చెల్లించాలా లేక పనిచేసినప్పుడు గంటల ప్రకారం అద్దె చెల్లించాలా అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉందని కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. దీని వ్యయం రూ.17కోట్లు ఉంటుందని, అందుకే కొనుగోలుచేయకుండా అద్దె ప్రాతిపదికన ఉపయోగించుకోవాలని నిశ్చయించినట్లు పేర్కొన్నారు. నగరంలో అక్రమ నిర్మాణాల సంఖ్య లక్షల్లో ఉంది. బీఆర్‌ఎస్ పథకానికే సుమారు 1.2లక్షల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 2008లో ప్రవేశపెట్టిన బీఆర్‌ఎస్ పథకానికి సైతం 1.5లక్షల దరఖాస్తులొచ్చాయి. అక్రమ భవనాల్లో పూర్తిగా అనుమతులు లేకుండా నిర్మించే భవనాలు, చెరువులు, కుంటలు, రోడ్లు, నాలాలు తదితర వాటిని ఆక్రమించుకొని నిర్మించుకునే భవనాలున్నాయి.