తెలుగుదేశం పార్టీ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ ఈ నెల 21వ తేదీన ఇక్కడ జరగనుంది. సచివాలయం సమీపంలోని ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఆనుకొని కొత్తగా నిర్మించిన గ్రీవెన్స్ హాల్‌లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకూ ఈ సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను దీనికి ఆహ్వానిస్తున్నారు. ఇటీవల ముగిసిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం, జన్మభూమిలో వచ్చిన వినతుల పరిష్కారం, కొత్తగా నియమించిన సాధికార మిత్ర, సేవా మిత్రలను మరింత సమర్ధంగా వినియోగించుకోవడం, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యక్రమంపై ఈ సమావేశంలో చర్చలు ఉంటాయి. అదే రోజు రాత్రి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్తారు.