YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాజ్యసభకు ప్రియాంక గాంధీ

రాజ్యసభకు ప్రియాంక గాంధీ

రాజ్యసభకు ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17
రానున్న కాలంలో రాజ్యసభలో విపక్షాల బలం మరింత తగ్గనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో వేర్వేరు సమయాల్లో పదవీ కాలం పూర్తవనున్న సీట్లకు తమ పార్టీ అభ్యర్థులను పంపడం ద్వారా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) బలం పెంచుకొనే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ బలం కూడా సభలో బాగా తగ్గనుంది. అయితే, ఈ సారి పదవీ కాలం పూర్తయ్యే కాంగ్రెస్ సభ్యుల స్థానంలో భర్తీ చేయబోయేవారి జాబితాలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేరు కూడా వినిపిస్తోంది.రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి. అయితే, ఈ ఏడాది మొత్తం 68 సీట్లు ఖాళీ అవుతాయి. ఇవన్నీ ఒకేసారి ఖాళీ కాకుండా ఏప్రిల్‌లో 51, జూన్‌లో 5, జులైలో 1, నవంబర్‌లో 11 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. ఇందులో 19 సీట్లు కాంగ్రెస్‌ పార్టీ కోల్పోనుంది. సంఖ్యాబలాన్ని బట్టి అందులో ఆ పార్టీ సొంతంగా తిరిగి మిత్రపక్షాల సహకారంతో ఓ పది స్థానాలు గెలిపించుకోగల సామర్థ్యం ఉంది.ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఆ పార్టీ అధికారంలో ఉండడం కాంగ్రెస్‌కు బాగా కలిసి వచ్చింది. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి తిరిగి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోనుంది. ఇదే సమయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మేఘాలయ, అసోం రాష్ట్రాల ప్రాతినిథ్యం ఉన్న రాజ్యసభ స్థానాలను కోల్పోతుంది.కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేతల రాజ్యసభ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌ లేదా జూన్‌లో ముగుస్తుంది. వీరిలో కొందరికి మళ్లీ అవకాశం దక్కనుండగా, ఈసారి ప్రియాంక గాంధీ, జ్యోతిరాధిత్య సింథియా, రణ్‌దీప్‌ వంటి నేతలను ఎగువ సభకు పంపే అవకాశం ఉంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల్లో ఆ పార్టీ తమ అభ్యర్థులను గెలిపించుకోగలదు.ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బలం 82 ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఎగువ సభలో బీజేపీకి తగిన సంఖ్యా బలం లేదు. దీంతో బిల్లులను ఆమోదించుకోవడం వంటి సందర్భాల్లో ఇబ్బంది ఎదుర్కొంటోంది. ఇకపై విపక్షాల బలం తగ్గనుండడంతో ఎన్డీయేకు ఈ సారి బలం పెరుగుతుంది. కాంగ్రెస్‌కు 46 మంది సభ్యులున్నారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో 1, ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోనుంది. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సైతం అభ్యర్థులను గెలిపించుకుని బలం పెంచుకోనుంది.ఈసారి రాజ్యసభకు సీనియర్లను కాకుండా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపించాలని సోనియా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రియాంకతో పాటు మరికొందరు జూనియర్లను కూడా రాజ్యసభకు పంపించి సభలో పార్టీకి కొత్త ఊపు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటు లోక్‌సభలో రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రియాంక గాంధీ ఇలా ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తూ పార్టీని పటిష్ఠం చేస్తారన్న సూత్రాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం అనుసరించనున్నట్లు తెలుస్తోంది.

Related Posts