పెనుకొండలో పడగ విప్పుతున్న భూ మాఫియా
అనంతపురం, ఫిబ్రవరి 17,
కియా పరిశ్రమ తరలి వెళ్తోందన్న ప్రచారంతో ఒక్కసారిగా ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లతోనే కియా యాజమాన్యం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఆ సంస్థలో కాంట్రాక్టుల కోసం కొంత మంది నేతలు చేస్తున్న ప్రయత్నాలు కియా యాజమాన్యంకు సంకటంగా మారందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఆ సంస్థ రావడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదునుగా భూమాఫియా రాజకీయ నాయకులు కొంత మంది రంగ ప్రవేశం చేశారు. లావాదేవీల్లోనూ తగాదాలొస్తుండటంతో ఘర్షణలు నిత్యకృత్యమవుతున్నాయి. గత కొంత కాలంగా ముఖ్యనేతలు కొనుగోలు చేసిన ఒక భూ విషయంలోనే తరచూ వివాదం చెలరేగుతూనే ఉంది. పోలీసుల దృష్టికి వెళ్లినా సివిల్ వ్యవహారమంటూ మిన్నకుండిపోతున్నారు. ఈ వివాదంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులుండటం గమనార్హం. గత వారంలోనూ పరస్పరం రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక గ్రూపు పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు కాలేదు. ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.పెనుకొండ మండలంలోని అమ్మవారిపల్లి వద్ద కియా కార్ల పరిశ్రమ వచ్చింది. ప్రస్తుతం ఏర్పాటైన ప్రధాన ప్లాంటును ఆనుకుని ఉన్న 250 ఎకరాల స్థలాన్ని 2011 ఉత్తరాదికి చెందిన వారు వ్యవసాయాధారిత ఉత్పత్తుల పరిశ్రమ పేరుతో భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 2017లో కియా కార్ల పరిశ్రమ ఇక్కడికి వస్తుందన్న సమయంలో ఒక వ్యాపారితోపాటు, టిడిపికి చెందిన ప్రజాప్రతినిధి, బిజెపికి చెందిన మరో నాయకుడు ముగ్గురు కలసి ఆ సంస్థను టేకేవోర్ చేశారు. వాస్తవానికి ఆ సంస్థ ఎటువంటి వ్యవసాధారిత ఉత్పత్తులు చేసిన దాఖలాల్లేవు. ఈ ముగ్గురు కొనుగోలు చేసిన ఈ భూమిని అమ్ముకునే క్రమంలో డబ్బులు తీసుకుని మరికొంత మందిని భాగస్వామ్యులను చేసుకున్నారు. అక్కడి నుంచి ఇతరులకు ఈ భూములను అమ్ముకునే క్రమంలోనే కొంత వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే ఇప్పటి అధికార పార్టీ వైసిపి నాయకులు సైతం ఇందులోకి రంగ ప్రవేశం చేశారు. అనంతరం మొదటి భాగస్వామి అయిన వ్యాపారిపై మూడు మాసాల క్రితం అనంతపురం నగరంలో దాడికి ప్రయత్నం జరిగింది. పోలీసులు ఇరువర్గాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన మాజీ న్యాయవాది ఒకరు పెద్ద మనిషిగా వ్యవహరించి సమస్యకు పరిష్కారం సూచించే ప్రయత్నం చేశారు. అయినా ఆ సమస్య పరిష్కారమవకపోగా మరింత పెరిగింది. దీంతో తాజాగా బెంగళూరుకు చెందిన మాఫియా కూడా రంగ ప్రవేశం చేసినట్టు సమాచారం. వారి ద్వారా భాగస్వామ్యులను బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ఈ అంశాన్ని సివిల్ పంచాయతీగానే చూస్తూ మిన్నకుంటుండటం గమనార్హం. ఈ రకంగా కియా చుట్టూ భూముల ధరలు పెరగడంతో భూ వివాదాలు పెరుగుతుండటం కొత్తగా పరిశ్రమలు రాకపై ప్రభావం చూసే అవకాశాలున్నాయన్న వాదనలు
వినిపిస్తున్నాయి