YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నీళ్లకు నిధుల్లేవ్.. (అనంతపురం)

నీళ్లకు నిధుల్లేవ్.. (అనంతపురం)

నీళ్లకు నిధుల్లేవ్.. (అనంతపురం)
అనంతపురం, ఫిబ్రవరి 16 (న్యూస్ పల్స్): రెండేళ్లుగా బోరుబావి పథకానికి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లు నిధులు విదల్చడం లేదు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ రైతుల భూములకు బోరుబావి ఏర్పాటు జరగక సాగు నీరందడం లేదు. దీంతో వారు పంటలు పండించుకోలేకపోతున్నారు. ఆయా సామాజిక వర్గాల అభివృద్ధికోసం ఏర్పాటు చేసిన ఆ కార్పొరేషన్ల లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. షెడ్యూలు, గిరిజన కులాల సేవా సహకార సంఘాలు (ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లు) అమలు చేస్తున్న ప్రధాన పథకాల్లో బోరుబావి పథకం ఒకటి. బోరు బావి, మోటారు, విద్యుత్తు కనెక్షన్‌ ఏర్పాటు వంటివి ఈ పథకంలో ఏర్పాటు చేయనుండటంతో జిల్లాలోని ఆయా సామాజిక వర్గాల భూముల వృద్ధికి.. వారి ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది. అయితే ఈ పథకం జిల్లాలో రెండేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. నిధులు విడుదల చేయకపోవడమే కారణం. జిల్లాలో ఆ పథకానికి 900కు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పథకం మంజూరుపై దరఖాస్తుదారులు నిత్యం ఆ శాఖల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నిధులు విడుదలైతేనే పథకం మంజూరు చేస్తామని అధికారులు సమాధానం చెబతుండటంతో దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. ఎస్టీ కార్పొరేషన్‌ పరిధిలో 408 మంది రైతులు బోరు బావి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ పథకం అమలు చేయాలంటే రూ.4.40 కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న రైతుల భూముల్లో భూగర్భ జల శాఖ జియాలజిస్టులు పరిశీలించి 209 వాటిలో నీటి లభ్యత ఉందని ధ్రువీకరించారు. ఆ పథకానికి నిధుల మంజూరుకాకపోవడంతో మిగిలిన రైతుల భూముల పరిశీలన ప్రక్రియ నిలిచిపోయింది. ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలో ఈ పథకం కింద రెండేళ్ల పరిధిలో 510 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా.. 330 మంది రైతుల భూముల్లో భూగర్భజల శాఖ జియాలజిస్టులు పరిశీలించి నీటి లభ్యత ఉందని ధ్రువీకరించారు. మిగిలిన వాటి పరిశీలన నిలిచిపోయింది. దరఖాస్తుదారులందరికీ ఈ పథకం అమలు చేయాలంటే సుమారు రూ.6.12 కోట్లు నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉందని సదరు అధికారులు చెబుతున్నారు. మూడెకరాలపైన భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రభుత్వం ఆయా కార్పొరేషన్‌ల ద్వారా బోరుబావి తవ్వకం, మోటారు, విద్యుత్తు కనెక్షన్‌ ఏర్పాటుకు పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే ఆ వర్గాల రైతులు రూ.12 వేలు లబ్ధిదారుని వాటా (కాంట్రిబ్యూషన్‌) చెల్లిస్తే ప్రభుత్వం రూ.1.20 లక్షలు విడుదల చేస్తుంది. ఈ పథకానికి  వచ్చిన దరఖాస్తులను ఆయా కార్పొరేషన్‌ అధికారులు జిల్లా భూగర్భజల శాఖకు పంపుతారు. ఆ శాఖ జియాలజిస్టులు రైతుల భూములను పరిశీలించి బోరుబావి ఏర్పాటుకు యోగ్యత ఉందా..? లేదా..? అని ధ్రువీకరిస్తారు. యోగ్యత ఉన్నట్లు ధ్రువీకరిస్తే.. ఆయా కార్పొరేషన్లు నిధులను విడుదల చేస్తాయి. కార్పొరేషన్లు మంజూరు చేస్తున్న పథకం మొత్తం కంటే బోరు, విద్యుత్తు కనెక్షన్‌ ఏర్పాటుకు అధికంగా ఖర్చు అయినట్లయితే ఆ మొత్తం రైతు భరించాల్సి ఉంటుంది.

Related Posts