హైద్రాబాద్ లో కోవిడ్ టెన్షన్
హైద్రాబాద్, ఫిబ్రవరి 17
కోవిడ్ వైరస్ తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంది. ప్రత్యేక పర్యవేక్షణతో ఆ శాఖ ఉన్నతాధికారులు కోవిడ్ వైరస్‌పై యుద్ధమే చేశారంటే అతిశయోక్తి కాదు. పది రోజుల నుంచి మొత్తం 92 మందిని పరీక్షించారు. ఇందుకోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలోనే థర్మల్ స్కానింగ్ ద్వారా ప్రయాణికులను క్షుణ్నంగా పరీక్షిస్తున్నారు. కోవిడ్ వైరస్ నగరంలోకి ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. వైరస్ సోకిందన్న అనుమానం ఉన్న వారిని వైద్యాధికారులు నిశితంగా పరీక్షించారు. వైరస్ లేదని తేలిన తర్వాతే వారిని ఆసుపత్రుల నుంచి బయటకు పంపారు. కోవిడ్ వైరస్ వ్యాప్తిపై తప్పుడు సమాచారం ఇచ్చారంటూ వసంత్ అనే వైద్యాధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే, దాంతో తనకు సంబంధం లేదని, తనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆ వైద్యుడు ఆత్మహత్యాయత్నం చేయడం, ఆయనకు డాక్టర్ల జేఏసీ మద్దతివ్వడం లాంటి ఘటనలు జరిగాయి. మొత్తంమీద గత వారం రోజుల్లో రాష్ట్రంలో ఎవరి నోట విన్నా ఇదే వైరస్ మాట వినిపించింది. చైనాతోపాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఏం జరుగుతోందన్న దానిపై ప్రజలు ఆరా తీస్తూ కనిపించారు. ముఖ్యంగా చైనాలో నెలకొన్న పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలు వైరల్ అయ్యాయి. కోవిడ్ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలంటూ... వాడాల్సిన మందులు ఇవేనంటూ ఫేక్ వార్తలు కూడా సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి. వాటిని నమ్మొద్దంటూ నిపుణులు సూచించారు. మరో వైపు చైనాలో చైనాలో కోవిడ్–19 మృతుల సంఖ్య రోజురోజుకూ ఎగబాకుతోంది. ఇప్పటివరకూ ఈ వైరస్ బారిన పడి 1712 మంది మరణించగా మొత్తం 66వేల మంది దీని బారినపడినట్లు నిర్ధారణ అయిందని చైనా ఆరోగ్య కమిషన్ శనివారం వెల్లడించింది. చైనా మొత్తమ్మీద కోవిడ్ బారిన పడినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 66,492కు చేరుకోగా, వీరిలో 11, 053 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్న వారి సంఖ్య 8096కు పెరిగింది. కోవిడ్ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేపీ తగ్గుతోందని చైనా ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించిందని, వ్యాధికి కేంద్రబిందువుగా భావిస్తున్న హుబే ప్రాంతం మినహా మిగిలిన చోట్ల తగ్గుదల నమోదవుతోందని తెలిపింది.