ఆటవీ శాఖ షరతులు
శివస్వాముల ఇక్కట్లు
నాగర్ కర్నూలు ఫిబ్రవరి 17
నల్లమల మీదుగా శ్రీశైల క్షేత్రానికి వెళ్లే భక్తులకు ప్రత్యేక షరతులు పెట్టింది తెలంగాణ అటవీ శాఖ. నల్లమల అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ కోసం ఈ షరతులు విధించింది. భక్తులు అడవిలో నిర్దేశించిన ప్రాంతాలు, రోడ్ల ద్వారానే ప్రయాణించాలని ఆదేశించింది. అటవీ మార్గాల్లో కాలి బాటల్లో ప్రయాణంపై నిషేధం విధించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విరామ ప్రాంతాల్లో మాత్రమే సేద తీరేందుకు అనుమతి ఇస్తారు. అక్కడ తాగునీటి సౌకర్యం కూడా కల్పించించారు అటవీ శాఖ అధికారులు. అడవిలో నిప్పు రాజేయటం, వంటలు వండటం నిషేధించారు. ఇటీవల అటవీ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చింది అటవీశాఖ. ఈ నిబంధనలు ఉల్లంఘించి అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వారిపై అటవీశాఖ చర్యలు తీసుకుంటుంది. నిర్ధేశిత షరతులను పాటించి అడవుల సంరక్షణ, అగ్ని ప్రమాదాల నివారణకు సహకరించాలని భక్తులను కోరింది.పాదయాత్ర చేసే శివస్వాములు అడవి దారిన వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు. మన్ననూర్ నుంచి ఓటర్ల పల్లి వరకు రోడ్డు మార్గాన వెళ్తే ముప్పై కిలోమీటర్లు దూరమవుతుందని రోడ్డు మీద నడవలేక పోతామని శివస్వాములు అంటున్నారు.